కరోనా కట్టడిలో దేశంలోని వ్యవస్థ విఫలమైందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. దేశంలో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న ఈ సమయంలో.. మహమ్మారితో బాధ పడుతున్న తోటి పౌరులకు సాయం అందించే బాధ్యత తమ పార్టీపై ఉందని వ్యాఖ్యానించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహించే మన్‌కీ బాత్ కార్యక్రమాన్ని ఉద్దేశించి రాహుల్ పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు జనం గురించి మాట్లాడుకోవడం(జన్‌కీ బాత్) ముఖ్యమని ఎద్దేవా చేశారు.
"వ్యవస్థ విఫలమైంది. కాబట్టి జన్‌కీ బాత్ చేయడం ఇప్పుడు ముఖ్యం. ఈ సంక్షోభ సమయంలో దేశానికి బాధ్యతాయుతమైన పౌరులు అవసరం. రాజకీయ సంబంధిత పనులను పక్కనబెట్టి, ప్రజలకు అన్ని రకాల సాయం అందించాలని తోటి కాంగ్రెస్ పార్టీ నేతలను కోరుతున్నా."
-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత
కంట్రోల్ రూమ్..
మరోవైపు, పార్టీ కార్యకర్తలు చేపట్టే సహాయ కార్యక్రమాలను సమన్వయం చేసేందుకు ఏఐసీసీ కంట్రోల్ యూనిట్ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ ప్రతిపాదనకు ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఆమోదం తెలిపారు. అన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారు. వీటన్నింటినీ ఏఐసీసీ కంట్రోల్ రూం సమన్వయం చేస్తుంది.
ఇదీ చదవండి- 'టీకాల ధరలు సాధ్యమైనంత తగ్గించండి'