బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నామినేషన్ తిరస్కరించాలని డిమాండ్ చేశారు ఆమె ప్రత్యర్థి, నందిగ్రామ్ భాజపా అభ్యర్థి సువేందు అధికారి. నామపత్రాల్లో.. తనపై ఉన్న 6 క్రిమినల్ కేసులను మమత వెల్లడించలేదని ఆరోపించారు.
ఈ మేరకు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు అధికారి. అసోంలో మమతపై దాఖలైన 5 కేసులు, బంగాల్లో సీబీఐ నమోదు చేసిన ఓ కేసు వివరాలను వెల్లడించలేదన్నారు.
"నందిగ్రామ్ టీఎంసీ అభ్యర్థి, ముఖ్యమంత్రి తన అఫిడవిట్లో.. ఆమెపై ట్రయల్లో ఉన్న ఆరు కేసులను పేర్కొనలేదు. ఒకటి సీబీఐ కేసు, మరో ఐదు అసోంలో ఉన్నాయి. ఆమె నామినేషన్ తిరస్కరించాలని ఎన్నికల సంఘాన్ని కోరాను. వారు అవసరమైన చర్యలు తీసుకుంటారనే నమ్మకం ఉంది. ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూస్తాను. ఆ చర్యలు చట్టపరంగా ఉండాలి."
- సువేందు అధికారి, భాజపా నందిగ్రామ్ అభ్యర్థి.
సువేందు ఫిర్యాదులో కేసులకు సంబంధించిన నంబర్లను పేర్కొన్నారని, అయితే.. టీఎంసీ అధినేత్రి చేసిన నేరాల గురించి వివరించలేదని రాష్ట్ర ఎన్నికల సంఘం సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఈ అంశాన్ని పరిశీలించనున్నట్లు చెప్పారు.
సువేందు అధికారి ఫిర్యాదుపై ఇప్పటి వరకు టీఎంసీ నుంచి ఎలాంటి స్పందన లేదు.
అభ్యర్థులు తమ ఆస్తులు, క్రిమినల్ కేసులపై వివరాలు దాచివేస్తే వారి నామినేషన్ తిరస్కరించాలని ఎన్నికల సంఘానికి సూచించింది సుప్రీంకోర్టు. ఈ అంశంపై 2018మార్చిలో కీలక ఆదేశాలిచ్చింది. తమ అభ్యర్థి గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాల్సిన ప్రాథమిక హక్కు ఓటర్లకు ఉందని స్పష్టం చేసింది.
ఇదీ చూడండి: భాజపాకు అమ్మడం తప్ప నిర్మించడం రాదు: రాహుల్