జమ్ముకశ్మీర్లో మరోసారి డ్రోన్లు ప్రత్యక్షమయ్యాయి. సోమవారం అర్ధరాత్రి జమ్ములోని రత్నాచుక్, కుంజ్వాని ప్రాంతంలో డ్రోన్లు సంచరించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉందన్నారు.
జమ్ము వైమానిక స్థావరంపై జరిగిన దాడిని మరువక ముందే ఆదివారం అర్ధరాత్రి మరో రెండు డ్రోన్లు పాక్ నుంచి భారత్ వైపునకు దూసుకొచ్చాయి. తాజాగా మరోసారి.. డ్రోన్లు సంచరించటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
ఎన్ఐఏ రంగంలోకి..
జమ్ములోని వైమానిక స్థావరంపై డ్రోన్ దాడిని కేంద్ర హోం శాఖ తీవ్రంగా పరిగణించింది. ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ)కు అప్పగించింది. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు నిర్వహించాలని ఆదేశించింది.
మరోవైపు.. భవిష్యత్తులో ఇలాంటి డ్రోన్ దాడులను అరికట్టాలంటే అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాల్సిందేనని నిపుణులు సూచిస్తున్నారు.
ఎన్ఎస్జీ బృందం పర్యటన
జమ్ములో డ్రోన్ దాడి జరిగిన వైమానిక స్థావరంలో జాతీయ భద్రత దళం(ఎన్ఎస్జీ) పర్యటించింది. ప్రత్యేక డాగ్ స్క్వాడ్ టీం.. ఘటనా స్థలిలో దర్యాప్తు చేపట్టింది. దాడిలో ఆర్డీఎక్స్ లేదా టీఎన్టీ పేలుడు పదార్థాన్ని వినియోగించినట్లు భద్రతా దళాలు అనుమానిస్తున్నాయి.
ఐరాసలో భారత్ ఆందోళన..
జమ్ములోని వైమానిక స్థావరంపై జరిగిన డ్రోన్ దాడిని ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో భారత్ ప్రస్తావించింది. డ్రోన్లతో ఉగ్రవాద కార్యకలాపాలను జరపటం ఆందోళనకర అంశం అని తెలిపింది. దేశంలోని కీలకమైన సైన్య స్థావరాలే లక్ష్యంగా దాడులు చేయటాన్ని తీవ్రంగా పరిగణించాలని పేర్కొంది.
" ప్రస్తుతం ఎక్కడ చూసినా సాంకేతికత దుర్వినియోగం జరుగుతోంది. ఇంటర్నెట్, సామాజిక మాధ్యమాలు వేదికగా ఉగ్రవాద కాల్యకలాపాలు జరుగుతున్నాయి. ఉగ్రదాడుల కోసం సాంకేతికతను ఉపయోగించటం తీవ్ర పరిణామంగా భావించాలి. తక్కువ ధరకే ఇలాంటి డ్రోన్లు లభ్యం కావటం, సులభంగా మార్కెట్లో అందుబాటులో ఉండటంతో ఈ దాడులను ఎంచుకున్నారు. కానీ ఇలాంటి దాడులు చాలా ప్రమాదం."
-- వీఎస్కే కౌముది, కేంద్ర హోం శాఖ ప్రత్యేక కార్యదర్శి
ఇదీ చదవండి : జమ్ములో మళ్లీ డ్రోన్ల కలకలం- సైన్యం అప్రమత్తం