Kerala police custody death: కేరళ కోజికోడ్‌లో పోలీస్ కస్టడీ మృతి కేసులోని అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ కేసుతో సంబంధం ఉన్న స్టేషన్ హౌస్ ఆఫీసర్ సహా 66 మంది పోలీసులను బదిలీ చేసింది. గత వారం పోలీస్ కస్టడీ నుంచి విడుదలైన 42 ఏళ్ల వ్యక్తి అనుమానాస్పదంగా మృతిచెందాడు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు చెలరేగాయి. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి పినరయి విజయన్ క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. అంతకుముందే రూరల్ ఎస్పీ ఇచ్చిన నివేదిక మేరకు.. ఒక ఎస్సై సహా ముగ్గురు పోలీసులను సస్పెండ్ చేశారు కన్నూర్ డీఐజీ.
గతవారం వటకర సమీపంలోని తెరువాత్‌లో సంజీవన్ అనే వ్యక్తి కారు.. మరో వాహనాన్ని ఢీకొట్టింది. సమాచారం అందుకున్న పోలీసులు.. ప్రమాద స్థలానికి చేరుకుని సంజీవన్‌ను కస్టడీలోకి తీసుకున్నారు. అప్పటికే అస్వస్థతకు గురైన సంజీవన్‌ను పోలీసులు వేధించారన్నది ప్రధాన ఆరోపణ. ఆ తర్వాత విడుదల చేయగా సంజీవన్ అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. దీంతో సమీప ఆస్పత్రికి తరలించారు స్నేహితులు. అప్పటికే అతడు మృతి చెందినట్లుగా వైద్యులు ప్రకటించారు. సంజీవన్ అస్వస్థతకు గురైనా పోలీసులు పట్టించుకోలేదని.. ఆస్పత్రికి తరలించడానికి ఎవరూ సహకరించలేదని అతడి స్నేహితులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్పందించిన రాష్ట్ర మానవ హక్కుల సంఘం నివేదిక సమర్పించాలని పోలీసు శాఖను ఆదేశించింది.
ఇవీ చదవండి: విద్యార్థిపై ఒకేసారి ముగ్గురు టీచర్ల ప్రతాపం.. దెబ్బలకు తట్టుకోలేక మృతి
ఈడీ విచారణలో సోనియాకు లంచ్ బ్రేక్.. ఇంటికి కాంగ్రెస్ అధినేత్రి