ఉత్తరాఖండ్ చమోలీ జిల్లాలో సహాయక చర్యలకు వరుస ఆటంకాలు ఎదురవుతున్నాయి. ధౌళిగంగా నది మరోసారి ఉగ్రరూపం దాల్చడం వల్ల అధికారులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ముందు జాగ్రత్త చర్యగా తపోవన్ సొరంగం వద్ద సహాయక చర్యలు నిలిపివేశారు.
అంతకుముందు, తవ్వకాలు జరిపే యంత్రం చెడిపోవడం వల్ల తపోవన్ సొరంగం వద్ద సహాయక చర్యలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. నీటి ప్రవాహ ఉద్ధృతి పెరగడం వల్ల సిబ్బంది హుటాహుటిన వెనక్కి వచ్చేశారు. యంత్రాలను బయటకు తీసుకొచ్చారు. ఈ సొరంగంలో 25-35 మంది చిక్కుకున్నట్లు అధికారులు భావిస్తున్నారు.
నదీ ప్రవాహం ప్రమాదకరంగా మారడం వల్ల సమీపంలోని ప్రజలను అప్రమత్తం చేసినట్లు రాష్ట్ర డీజీపీ అశోక్ కుమార్ తెలిపారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను ఖాళీ చేయించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.