COVID-19 vaccinations: కొవిడ్-19 వ్యాక్సిన్ తీసుకునేందుకు ఏ ఒక్కరిని బలవంతం చేయరాదని స్పష్టం చేసింది సుప్రీం కోర్టు. అయితే, టీకా వల్ల వచ్చే రోగనిరోధకత ప్రభావంపై ప్రజలకు అవగాహన కల్పించాలని కేంద్రానికి సూచించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ప్రతిఒక్కరికి తమ శరీరంపై స్వయం ప్రతిపత్తి ఉంటుందని జస్టిస్ ఎల్ నాగేశ్వరరావు, జస్టిస్ బీఆర్ గవాయ్‌లతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది. ప్రస్తుతం నిర్వహిస్తున్న వ్యాక్సినేషన్ విధానంపై సంతృప్తి వ్యక్తం చేసిన ధర్మాసనం.. ఏకపక్షంగా, అసమంజసంగా ఉందని చెప్పలేమని పేర్కొంది. కొవిడ్-19 వ్యాక్సిన్ల క్లినికల్ ట్రయల్స్, పోస్ట్-జాబ్ కేసులకు సంబంధించిన డేటాను బహిర్గతం చేసేందుకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ జాకబ్ పులియెల్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈ మేరకు ఆదేశించింది.
"వ్యాక్సినేషన్‌కు సంబంధించిన ఆదేశాలను పాటించాలి. బహిరంగ ప్రదేశాల్లో తిరిగేందుకు టీకా తీసుకోనివారిపై ఆంక్షలు విధించొద్దు. ఇప్పటికే అమలులో ఉన్న వాటిని తొలగించాలి. వ్యక్తుల గోప్యతకు లోబడి వ్యాక్సిన్ ట్రయల్స్ డేటాను ప్రజలకు అందుబాటులో ఉంచాలి."
- ధర్మాసనం.
వ్యక్తిగత గోప్యతకు లోబడి అందరికి అందుబాటులో ఉండే విభాగాల్లో వ్యాక్సిన్ ప్రతికూల సంఘటనల వివరాలను పొందుపరచాలని కేంద్రాన్ని ఆదేశించింది సుప్రీం ధర్మాసనం. వ్యాక్సిన్ తీసుకోని వారిపై కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన ఆంక్షలను తొలగించాలని స్పష్టం చేసింది. ప్రజాప్రయోజనాల కోసం ప్రభుత్వం రూపొందించిన విధానంలో కొన్ని షరతులు విధించవచ్చని సుప్రీంకోర్టు తెలిపింది.
ఇదీ చూడండి: గ్యాంగ్‌స్టర్ ఇంటిపై పోలీసుల రైడ్.. కాసేపటికే బాలిక మృతి.. ఏమైంది?