దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖింపుర్ ఖేరిలో (Lakhimpur Kheri Incident) చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై సుప్రీంకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ కేసును గురువారం విచారణ చేపట్టనుంది. ఈ కేసును యూపీ పోలీసులు దర్యాప్తు చేపట్టడంపై నిరసనలు వ్యక్తమవుతుండడం వల్ల సుప్రీంకోర్టు (Lakhimpur Kheri Incident) విచారించాలని నిర్ణయించింది. మరోవైపు, ఈ కేసులో జోక్యం చేసుకొని సీబీఐతో దర్యాప్తు చేయించాలని కోరుతూ యూపీకి చెందిన కొందరు న్యాయవాదులు కూడా.. సీజేఐకి మంగళవారం లేఖ రాశారు.
కేంద్రం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఆదివారం.. లఖింపుర్ ఖేరిలో (Lakhimpur Kheri Incident) రైతులు తికోనియా-బన్బీపుర్ రహదారిపై అన్నదాతలు ఆందోళన చేస్తుండగా కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్ మిశ్రా తనయుడు ఆశిష్ మిశ్రా కారు, మరో వాహనం వారిపైకి దూసుకెళ్లాయి. ఈ ఘటనలో నలుగురు రైతులు అక్కడికక్కడే మరణించగా.. అనంతరం రైతుల దాడిలో మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై కేంద్రమంత్రి తనయుడు సహా పలువురిపై కేసులు నమోదయ్యాయి. యూపీ ప్రభుత్వం ఈ ఘటనపై సిట్‌ను ఏర్పాటు చేసింది.