ఉత్తర్‌ప్రదేశ్‌లో ఐదు ప్రధాన నగరాల్లో లాక్‌డౌన్ విధించాలన్న అలహాబాద్ హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఆ నగరాల్లో ఏప్రిల్ 26 వరకు కొవిడ్ నిబంధనలను కఠినంగా అమలుచేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం వెల్లడించింది.
రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. ప్రభుత్వం ఇప్పటికే కరోనా నిబంధనలను అమలు చేస్తోందని ధర్మాసనానికి విన్నవించారు. న్యాయస్థాన ఆదేశాలతో లాక్‌డౌన్ విధించమనడం సరైన విధానం కాదని తెలిపారు. లాక్‌డౌన్ విధిస్తే పాలనాపరమైన ఇబ్బందులు వస్తాయని వెల్లడించారు.
ఈ విషయంలో సీనియర్ న్యాయవాది పీ.ఎస్ నరసింహను అమికస్ క్యూరీగా నియమిస్తూ.. కేసును మరో రెండు వారాలకు వాయిదా వేసింది.
కరోనా దృష్ట్యా ఐదు ప్రధాన నగరాలైన లఖ్‌నవూ, ప్రయాగ్‌రాజ్, వారణాసి, కాన్పుర్, గోరఖ్‌పుర్‌లో ఈ నెల 26వరకు లాక్‌డౌన్ విధించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అలహాబాద్ హైకోర్టు సోమవారం ఆదేశించింది. తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
వారాంతపు లాక్‌డౌన్: కరోనా వ్యాప్తి దృష్ట్యా ఉత్తర్‌ప్రదేశ్‌లో వారాంతపు లాక్‌డౌన్ విధించింది రాష్ట్ర ప్రభుత్వం. శని, ఆదివారాల్లో ఈ మేరకు కఠిన ఆంక్షలు ఉండనున్నట్లు పేర్కొంది.
శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి సోమవారం ఉదయం 7 గంటల వరకు లాక్‌డౌన్ కొనసాగనుంది. అయితే ఉత్తర్‌ప్రదేశ్‌లో ఇప్పటికే రాత్రి కర్ఫ్యూ అమల్లో ఉంది.
ఇదీ చదవండి: ప్రధాని.. పోర్చుగల్, ఫ్రాన్స్ పర్యటనలు రద్దు!
ఇదీ చదవండి: 'కరోనా నియంత్రణకు సైన్యం సేవలు విస్తరించాలి'