ప్రజాస్వామ్యంలో హైకోర్టులు కీలక పాత్ర పోషిస్తాయని.. వాటిని నిరుత్సాపరచాలని అనుకోవడం లేదని సుప్రీంకోర్టు వెల్లడించింది. ఎన్నికల సంఘంపై మద్రాసు హైకోర్టు చేసిన వ్యాఖ్యలు.. వాదనల సమయంలో సాధారణంగా జరిగే విషయమేనని పేర్కొంది. న్యాయమూర్తులు చేసే వ్యాఖ్యలు ప్రజల శ్రేయస్సుకు అనుగుణంగా ఉంటాయని.. వాటిని సరైన విధానంలో పరిగణించాలని స్పష్టం చేసింది.
దేశంలో కరోనా రెండో దశకు ఎన్నికల సంఘం బాధ్యత వహించాలని, అధికారులపై హత్య కేసు నమోదు చేయాలని ఇటీవలే మద్రాసు హైకోర్టు వ్యాఖ్యానించింది. హైకోర్టు వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ ఈసీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సోమవారం.. ఈ వ్యవహారంపై జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది.
మీడియాపైనా సుప్రీంకోర్టు పలు వ్యాఖ్యలు చేసింది. మీడియా జవాబుదారీతనంతో ఉండి వార్తలను అందించాలని స్పష్టం చేసింది. మీడియా ప్రజాస్వామ్యంలో ఒక భాగమని.. హైకోర్టులకు సంబంధించిన వార్తలను ప్రచురించకుండా మీడియాను అడ్డుకోలేమని పేర్కొంది. అనంతరం తమ ఆదేశాలను రిజర్వులో పెట్టింది సర్వోన్నత న్యాయస్థానం.
ఇదీ చూడండి:- 'ఈసీ అధికారులపై మర్డర్ కేసులు పెట్టాలి'