ధన్‌బాద్ జడ్జి హత్య కేసు విచారణపై ఝార్ఖండ్ హైకోర్టుకు సుప్రీంకోర్టు సూచనలు చేసింది. కేసు విచారణను ప్రతి వారం సమీక్షించాలని ఆదేశించింది. సీబీఐ సమర్పించిన సీల్డ్ కవర్ నివేదికలో కొత్తగా ఏమీ లేదని సీజేఐ జస్టిస్ ఎన్‌వీ రమణ తెలిపారు. నివేదికలోని విషయాలు చాలా వరకు రాష్ట్ర విచారణలో ఉన్నాయని పేర్కొన్నారు. కేసు పురోగతిని ప్రతి వారం ఝార్ఖండ్ హైకోర్టుకు చెప్పాలని సీబీఐని ఆదేశించారు. అవసరమైన సందర్భంలో తాము కేసు విచారణ చేపడతామని సీజేఐ స్పష్టం చేశారు. న్యాయాధికారులకు సురక్షితంగా ఉన్నామనే భావన రావాల్సి ఉందని అన్నారు.
ఈ క్రమంలో వాదనలు వినిపించిన ఎస్‌జీ తుషార్ మెహతా.. వాహనం నడిపిన వ్యక్తులను అరెస్టు చేసి విచారిస్తున్నామని ధర్మాసనానికి నివేదించారు. దేశవ్యాప్తంగా న్యాయాధికారుల భద్రతపై ఒక విధానం రూపొందించనున్నామని తెలిపారు.