అతిగా మద్యం తాగి చనిపోయిన వ్యక్తి వారసులకు బీమా పరిహారం చెల్లించాల్సిన అవసరం లేదని సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. ప్రమాదంలో మరణిస్తే తప్ప ఇతర ఎలాంటి సందర్భాల్లోనూ పరిహారం ఇవ్వాల్సిన అవసరం లేదని జస్టిస్ ఎం.ఎం.శాంతన్ గౌండర్, జస్టిస్ వినీత్ శరణ్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఈ విషయమై జాతీయ వినియోగదారుల వివాద పరిష్కార సంఘం ఇచ్చిన తీర్పును సమర్థించింది.
ఇదీ కేసు..
హిమాచల్ ప్రదేశ్- సిమ్లాలోని చోపాల్ పంచాయతీలో.. అటవీ సంస్థలో పనిచేస్తున్న ఓ వ్యక్తి 1997 అక్టోబరు 7-8 తేదీల మధ్య కురిసిన భారీ వర్షాలు, చలి కారణంగా ప్రాణాలు కోల్పోయినట్టు కుటుంబ సభ్యులు అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే.. శవ పరీక్ష నిర్వహించగా ఆయన శరీరంపై ఎలాంటి గాయాలు లేవని, అధికంగా మద్యం తాగడం వల్లే ప్రాణాలు కోల్పోయినట్టు తేలింది. ఇది ప్రమాదం కానందున పరిహారం చెల్లించడానికి బీమా కంపెనీ నిరాకరించింది.
కుటుంబ సభ్యులు వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించగా.. వారికి అనుకూలమైన తీర్పు వెలువడింది. అనంతరం.. బీమా కంపెనీ జాతీయ ఫోరంను ఆశ్రయించింది. బీమా కంపెనీ ఎలాంటి పరిహారం చెల్లించాల్సిన అవసరం లేదని, అటవీ సంస్థ మాత్రం ఇవ్వాల్సి ఉంటుందని ఫోరం తెలిపింది. దీనిపై సుప్రీం కోర్టుకు అప్పీలు చేయగా.. పరిహారం చెల్లించాల్సిన బాధ్యత రెండు సంస్థలకూ లేదని తెలిపింది.
ఇదీ చదవండి: పరమ్‌బీర్ లేఖపై పార్లమెంటులో రగడ