కోర్టు తీర్పులు సరళంగా, సామాన్యులకు అర్థమయ్యేలా ఉండాలని సుప్రీంకోర్టు పేర్కొంది. హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన ఓ వ్యాజ్యంపై శనివారం విచారణ సందర్భంగా న్యాయమూర్తులు జస్టిస్ డి.వై.చంద్రచూడ్, జస్టిస్ ఎం.ఆర్.షాలతో కూడిన ధర్మాసనం.. తీర్పు పాఠాన్ని రాసిన విధానంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఈ వ్యాజ్యానికి సంబంధించి హిమాచల్ హైకోర్టు రాసిన తీర్పు పాఠం.. తలనొప్పి తెప్పించిందని న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఆర్.షా వ్యాఖ్యానించారు 'తీర్పు ఏమిటో ఇప్పటికీ అర్థం కాలేదు. పెద్ద పెద్ద వాక్యాలైతే ఉన్నాయి. ముందు ఒకటుంది. చివరికొచ్చేసరికి ఇంకోలా ఉంది. తీర్పు చదువుతున్నప్పుడు నా పరిజ్ఞానంపై నాకే అపనమ్మకం ఏర్పడింది. చివరి పేరా చదివిన తర్వాత తలనొప్పికి టైగర్ బామ్ రాసుకోవాల్సి వచ్చింది' అని ఎం.ఆర్.షా అన్నారు.
తీర్పులో తనకు ఒక్క ముక్క కూడా అర్థం కాలేదని న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ తెలిపారు. 'తీర్పు.. ఇలానా రాసేది. ఉదయం 10.10 గంటలకు చదవడం ప్రారంభించా. 10.55కి ముగించేసరికి నా పరిస్థితిని మీరు ఊహించలేరు. ఒక్క ముక్కా అర్థం కాలేదు' అని అన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ కృష్ణయ్యర్ తీర్పులను చంద్రచూడ్ ప్రస్తావించారు. అయ్యర్ తీర్పులు సరళంగా, చదివేవారికి ఎలాంటి ఇబ్బందులు కలిగించేవి కావని అన్నారు.
ఇదీ చదవండి: 'మహిళా న్యాయమూర్తుల కొరత ఆందోళనకరం'