Supreme Court On Stubble Burning : పంజాబ్‌లో పంట వ్యర్థాల కాల్చివేతకు సంబంధించి ఆ రాష్ట్రం ఇచ్చిన నివేదికపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. రైతులను ఎందుకు విలన్లుగా చూపిస్తున్నారని పెదవి విరిచింది. పంట వ్యర్థాలను కాల్చివేయడానికి రైతులకు పలు కారణాలు ఉండొచ్చని పేర్కొంది. పెద్ద రైతులకు యంత్రాలతో వ్యర్థాలను తొలగించే అవకాశం ఉంటుందన్న ధర్మాసనం.. చిన్న, సన్నకారు రైతులకు యంత్రాలు ఎక్కడుంటాయని ప్రశ్నించింది. చిన్న, సన్నకారు రైతులకు ఉచితంగా యంత్రాలను అందించే బాధ్యతను పంజాబ్ ప్రభుత్వమే ఎందుకు తీసుకోకూడదని ప్రశ్నించింది.
'ఆ విషయంలో హరియాణా ప్రభుత్వం సలహా తీసుకోండి'
పంట వ్యర్థాలను కాల్చివేసే విషయంలో హరియాణా ప్రభుత్వం నుంచి సలహాలు తీసుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. పంట వ్యర్థాలను కాల్చకుండా ఉండేందుకు రైతులకు అక్కడి ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇస్తోందని గుర్తు చేసింది. భూగర్భ జలాలు కూడా అడుగంటుతున్నాయన్న ధర్మాసనం.. వరి పండించడం వల్ల కలిగే దుష్పరిణామాలపై రైతులకు అవగాహన కలిగించాలని సూచించింది.
'పతంజలి' ఆయుర్వేదిక్ కంపెనీపై సుప్రీం ఆగ్రహం
Supreme Court On Patanjali Products : యోగా గురు రామ్‌దేవ్ బాబాకు చెందిన పతంజలి ఆయుర్వేద్ కంపెనీపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పతంజలి ఉత్పత్తులు.. వ్యాధులను నయం చేస్తాయంటూ అసత్య, తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇవ్వొద్దని స్పష్టం చేసింది. అలాంటి ప్రకటనలు నిలిపేయకపోతే తీవ్రంగా పరిగణిస్తామని సుప్రీం హెచ్చరించింది. ఏదైనా నిర్దిష్ట వ్యాధిని నయం చేయగలదంటూ తప్పుడు ప్రకటన ఇస్తే ఒక్కో ఉత్పత్తికి కోటి రూపాయల జరిమానా విధిస్తామని హెచ్చరించింది.
ఆధునిక వైద్య చికిత్స తీసుకుంటున్న వైద్యులు సైతం చనిపోతున్నారంటూ పతంజలి తప్పుడు ప్రచారం చేస్తోందని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వ్యాజ్యం దాఖలు చేసింది. వ్యాక్సినేషన్, అల్లోపతి వినియోగాన్ని నిరుత్సాహపరిచే యత్నం చేస్తోందని వ్యాజ్యంలో పేర్కొంది. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ అహసనుద్దీన్ అమనుల్లా, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాతో కూడిన ధర్మాసనం.. ఇలాంటి తప్పుడు ప్రకటనలు నివారించే చర్యలు చేపట్టాలని కేంద్రం తరఫు న్యాయవాదికి సూచించింది. తదుపరి విచారణను వచ్చే ఏడాది ఫిబ్రవరి 5కు వాయిదా వేసింది.
'చట్టసభ్యులపై క్రిమినల్ కేసుల విచారణలో జాప్యం వద్దు'- ప్రత్యేక బెంచ్‌ల ఏర్పాటుకు సుప్రీం ఆదేశం
కొలీజియం సిఫార్సుల విషయంలో కేంద్రంపై సుప్రీం ఫైర్- నచ్చిన పేర్ల ఎంపిక విధానం వద్దంటూ!