ఒకవైపు దేశంలో వైద్యుల కొరత తీవ్రంగా ఉంటే.. నీట్-పీజీ-21లో 1,456 సీట్లను భర్తీ చేయకుండా ఎందుకు వదిలేశారని మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ)పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటివరకు మొత్తం ఎన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయి, వాటిని అర్హులైన అభ్యర్థులతో ఎందుకు భర్తీ చేయట్లేదన్న విషయమై ఎంసీసీ, కేంద్ర ప్రభుత్వం 24 గంటల్లోగా ప్రమాణపత్రం దాఖలు చేయాలని ఆదేశించింది. అఖిల భారత కోటాలో స్ట్రే (మిగిలిపోయిన సీట్ల) కోటా కౌన్సెలింగ్ నిర్వహించిన తర్వాత కూడా 1,456 సీట్లు భర్తీ చేయకుండా వదిలేశారని, వాటికి ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించేలా ఆదేశించాలని కోరుతూ దాఖలైన పలు వ్యాజ్యాలను జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ అనిరుద్ధ బోస్‌లతో కూడిన ధర్మాసనం విచారిస్తోంది.
"ఒక్క స్థానం ఖాళీగా ఉన్నా భర్తీ చేయకుండా వదలకూడదు. అన్ని సీట్లూ భర్తీ అయ్యేలా చూడాల్సిన బాధ్యత మెడికల్ కౌన్సిల్‌దే. ప్రతి రౌండు కౌన్సెలింగ్ తర్వాతా ఇదే సమస్య కనిపిస్తోంది. ఈ విధానాన్ని ఎందుకు సరిచేయరు? మనకు వైద్యుల అవసరం చాలా ఉన్నా.. ఇలా ఎందుకు వదిలేస్తున్నాం? దీనివల్ల అభ్యర్థులకు సమస్యలే కాదు, అవినీతిని కూడా ప్రోత్సహించినట్లు అవుతోంది" అని ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది. విద్యార్థులు, తల్లిదండ్రులపై తీవ్రమైన ఒత్తిడి ఉంటోందని, మొత్తం స్థానాలకు ఒక కటాఫ్ తేదీ తప్పక ఉండాలని చెప్పింది. ప్రవేశాలు దొరకని విద్యార్థులకు నష్టపరిహారం చెల్లించేలా తాము ఆదేశాలు ఇవ్వాల్సి ఉంటుందని హెచ్చరించింది. ప్రవేశాలకు ఇన్‌ఛార్జి అయిన వైద్యసేవల డైరెక్టర్ జనరల్ (డీజీహెచ్‌ఎస్) గురువారం కోర్టుకు హాజరవ్వాలని ఆదేశించింది.
నీట్-పీజీ 2021-22 పరీక్షకు హాజరైన కొందరు వైద్య విద్యార్థులు అఖిల భారత కోటా రెండు రౌండ్లతో పాటు రాష్ట్ర కోటా కౌన్సెలింగ్‌కూ హాజరయ్యారు. ఆ తర్వాత ఆలిండియా మాపప్, రాష్ట్రస్థాయి మాపప్ కౌన్సెలింగ్‌లూ జరిగాయి. అయినా 1,456 సీట్లను భర్తీ చేయలేదంటూ పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
తదుపరి రౌండ్లకు కౌన్సెలింగ్ ఉండదు..: నీట్ పీజీ-21కు సంబంధించి నాలుగు రౌండ్ల ఆన్‌లైన్ కౌన్సెలింగ్ నిర్వహించామని ఆరోగ్య సేవల డైరెక్టరేట్ జనరల్ (డీజీహెచ్‌ఎస్) బుధవారం సుప్రీంకోర్టుకు తెలిపింది. సాఫ్ట్‌వేర్‌ను ఇప్పటికే మూసివేసినందున.. మిగిలిపోయిన 1,456 సీట్లకు ప్రత్యేక స్ట్రే రౌండ్ కౌన్సెలింగ్ నిర్వహించి భర్తీ చేయలేమని స్పష్టంచేసింది. ప్రత్యేక స్ట్రే రౌండ్ కౌన్సెలింగ్ నిర్వహించాలన్న పిటిషనర్ల అభ్యర్థన చాలా ఆలస్యం అయిందని, ఒకవేళ అలా చేస్తే.. నీట్ పీజీ-22 కౌన్సెలింగ్ సెషన్ ప్రక్రియ మొత్తం ప్రభావితమవుతుందని పేర్కొంది. రెండు అకడమిక్ సెషన్లకు సంబంధించిన కౌన్సెలింగ్‌ను ఏకకాలంలో నిర్వహించలేమని స్పష్టంచేసింది. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు పీజీ కోర్సులకు సంబంధించి నాలుగు రౌండ్ల ఆన్‌లైన్ కౌన్సెలింగ్ నిర్వహించినట్లు గుర్తు చేసింది. అదే సమయంలో న్యాయస్థానం ఆదేశాలు, స్ఫూర్తిని పాటించినట్లు వెల్లడించింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో డీజీహెచ్‌ఎస్ బుధవారం ప్రమాణపత్రం దాఖలు చేసింది.
కొవిడ్-19 మూడో దశ ఉద్ధృతి కారణంగా, అఖిల భారత కోటా సీట్లలో ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్ల అమలుకు సంబంధించి దేశంలోని వివిధ న్యాయస్థానాల్లో దాఖలైన కేసుల వల్ల నీట్ పీజీ-2021 కౌన్సెలింగ్ ఆలస్యం అయినట్లు అందులో పేర్కొంది. 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించి నీట్ పీజీ కోర్సులో స్ట్రే వేకెన్సీ రౌండ్ తర్వాత 1,456 సీట్లు మిగిలిపోయాయని, వీటిని వివిధ వివిధ రౌండ్లలో కౌన్సెలింగ్‌లో పాల్గొన్న అభ్యర్థులకు ఆఫర్ చేశామని స్పష్టంచేసింది. "పీజీ-2021 కౌన్సెలింగ్‌కు సంబంధించి అఖిల భారత స్ట్రే ఖాళీల రౌండ్‌లో 2,025 సీట్లు ఆఫర్ చేశాం. ఈ రౌండ్‌లో 1,17,945 మంది అభ్యర్థులు కౌన్సెలింగ్‌కు హాజరయ్యారు. కౌన్సెలింగ్ తర్వాత కూడా 1,456 సీట్లు ఖాళీగా ఉన్నాయి. వీటిలో సుమారు 1,117 ప్రీ పారామెడికల్‌కు సంబంధించిన సీట్లు. వీటిని వివిధ రౌండ్లలో అభ్యర్థులు ఎవరూ ఎంచుకోలేదు" అని తెలిపింది.
ఇదీ చూడండి : పొట్టలో 51 కొకైన్ క్యాప్సుల్స్.. విలువ రూ.9 కోట్లకుపైనే.. స్మగ్లింగ్ చేస్తూ అడ్డంగా...