Supreme Court on MLAs Poaching Case: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఆ పిటిషన్‌పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అరవింద్ కుమార్ ధర్మాసనం ముందు తెలంగాణ ప్రభుత్వం తరఫున ద్యుష్యంత్ దవే వాదనలు వినిపించారు.
ఎమ్మెల్యేలకు ఎర కేసు దర్యాప్తును ఎట్టి పరిస్థితుల్లో సీబీఐకి ఇవ్వొద్దని దుష్యంత్ దవే ధర్మాసనం ముందు వాదించారు. కేంద్రం చేతిలో సీబీఐ చిలుకగా మారిందన్న దవే.. సింగిల్ జడ్జి ఉత్తర్వులను డివిజన్ బెంచ్ ఒకసారి సమర్థించి మరోసారి వ్యతిరేకించిందన్నారు. ఒకవైపు సిట్ దర్యాప్తు జరుగుతుండగానే బీజేపీ నేతలు పిటిషన్ వేశారని పేర్కొన్నారు. దురుద్దేశపూర్వకంగానే బీజేపీ సీబీఐ విచారణను కోరారన్న ఆయన.. కేసు సీబీఐ చేతుల్లోకి వెళ్తే ఆధారాలు ధ్వంసమవుతాయని వాదించారు. కేసు పూర్తిగా నీరు గారి పోతుందని దుష్యంత్ దవే జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం ముందు వాదనలు వినిపించారు. కోర్టు సమయం ముగియడంతో ధర్మాసనం వాదనలను నిలిపివేసింది. దాంతో అసంపూర్తిగా విచారణ ముగిసింది.
ఇదిలా ఉంటే ఎమ్మెల్యేలకు ఎర కేసు తదుపరి విచారణపై సందిగ్ధత నెలకొంది. శనివారం నుంచి సుప్రీంకోర్టుకు హోలీ సెలవులు ఉన్న నేపథ్యంలో శుక్రవారమే విచారణ చేపట్టాలని దుష్యంత్ దవే అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు. శుక్రవారం విచారణ సాధ్యం కాదని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. జస్టిస్ గవాయ్ ధర్మాసనం ఈ కేసును కేసును సీజేఐ ధర్మాసనానికి రిఫర్ చేసింది. తదుపరి విచారణపై సీజేఐ నిర్ణయం తీసుకుంటారని జస్టిస్ గవాయ్ ధర్మాసనం తెలిపింది. మరో బెంచ్ నియమిస్తారా లేదా వెకేషన్ బెంచ్‌కి రిఫర్ చేస్తారా అనేది ప్రధాన న్యాయమూర్తి నిర్ణయిస్తారని స్పష్టం చేసింది.
సీబీఐకి అప్పగించిన హైకోర్టు : బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసు దర్యాప్తును సీబీఐకి బదిలీ చేస్తూ తెలంగాణ హైకోర్టు గతంలో ఆదేశాలు జారీ చేసింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తు పట్ల నమ్మకం లేదని బీజేపీ, నిందితులు వేసిన పిటిషన్లు పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
అసలేంటీ కేసు : గత ఏడాది అక్టోబర్ 26న హైదరాబాద్ నగర శివారులోని మొయినాబాద్ ఫాంహౌజ్‌లో బీఆర్ఎస్కు చెందిన నలుగురు ఎమ్మెల్యేల వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. బీజేపీలో చేరాలంటూ తనతో పాటు ముగ్గురు ఎమ్మెల్యేలు గువ్వల, బీరం హర్షవర్ధన్‌రెడ్డి, రేగా కాంతారావులను కొందరు ప్రలోభాలకు గురిచేస్తున్నారంటూ గత సంవత్సరం అక్టోబర్ 26ను తాండూరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఫాంహౌజ్‌పై దాడులు నిర్వహించారు. ఈ ఎమ్మెల్యేలకు ఎర కేసు వ్యవహారంలో రామచంద్రభారతి, నందకుమార, సింహయాజిలను ఆ రోజే పోలీసులు అదపులోకి విచారణ ప్రారంభించారు. ఈ కేసు విచారణ నిమిత్తం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. దీనిపై జరుగుతున్న విచారణ నేటికి ఓ కొలిక్కి రాలేదు.
ఇవీ చదవండి: