Supreme Court On Hijab Ban : కర్ణాటక హిజాబ్ వివాదం మరింత సంక్లిష్టమైంది. ఆ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై విచారణ చేపట్టిన ధర్మాసనంలోని ఇద్దరు న్యాయమూర్తులు.. గురువారం భిన్నమైన తీర్పులు ఇవ్వడం వల్ల కేసు ఎటూ తేలలేదు. హిజాబ్‌పై కర్ణాటక ప్రభుత్వ నిషేధాన్ని కొనసాగించేలా ఆ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించారు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ హేమంత్ గుప్తా. ఈ వ్యవహారంపై సర్వోన్నత న్యాయస్థానంలో దాఖలైన అపీళ్లన్నింటినీ కొట్టివేయాలని ప్రతిపాదించారు.
ధర్మాసనంలో సభ్యుడైన జస్టిస్ సుధాన్షు ధూలియా మాత్రం ఇందుకు భిన్నంగా తీర్పు రాశారు. కర్ణాటక హైకోర్టు తీర్పును పక్కనబెడుతూ.. హిజాబ్ బ్యాన్పై అపీళ్లను స్వీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. హిజాబ్ ధరించాలా లేదా అనేది వ్యక్తి స్వేచ్ఛకు సంబంధించిన అంశమని.. ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ కాదని ఆయన అన్నారు. మతవిశ్వాసాలను గౌరవించాలని, మతపరమైన అంశాలపై వివాదాలు లేకుండా చేయడమే మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 19 ప్రకారం కర్ణాటక హైకోర్టు తీర్పు చెల్లదని చెప్పారు.
ఈ వ్యవహారంపై తదుపరి విచారణ చేపట్టాల్సింది త్రిసభ్య ధర్మాసనమా లేక ఐదుగురు సభ్యుల ధర్మాసనమా అనేది సీజేఐ జస్టిస్ యూయూలలిత్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. సీజేఐ నిర్ణయం తర్వాత మళ్లీ హిజాబ్‌పై విచారణ కొనసాగనుంది. అయితే సుప్రీంకోర్టు న్యాయమూర్తుల భిన్నమైన తీర్పుల దృష్ట్యా.. పూర్తి స్థాయి స్పష్టత వచ్చేవరకు కర్ణాటక హైకోర్టు ఉత్తర్వులు వర్తిస్తాయని హిందువుల తరఫు న్యాయవాది బరుణ్ సిన్హా తెలిపారు.
హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకు..
విద్యా సంస్థల్లో హిజాబ్‌పై నిషేధాన్ని కర్ణాటక హైకోర్టు సమర్థించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన వివిధ పిటిషన్లపై సుప్రీంకోర్టు ఇంతకుముందు తన తీర్పును రిజర్వ్ చేసింది. ఈ కేసులో 10 రోజుల పాటు వాదనలు సాగగా, పిటిషనర్ల తరఫు 21 మంది న్యాయవాదులు, ప్రతివాదుల తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, అడిషనల్ సొలిసిటర్ జనరల్ కేఎం నటరాజ్, కర్ణాటక అడ్వకేట్ జనరల్ ప్రభులింగ్ నవాద్గీ వాదించారు.
సుప్రీంకోర్టులో హిజాబ్‌కు మద్దతుగా పిటిషనర్ల తరఫున న్యాయవాదులు తమ వాదనలను వినిపించారు. ముస్లిం బాలికలు హిజాబ్ లేకుండా పాఠశాలలకు వెళ్లలేకపోతున్నారని.. దీంతో వారి చదువులకు ఆటంకం ఏర్పడుతుందని.. చాలా మంది పాఠశాలకు వెళ్లడమే మానేశారని సుప్రీంకోర్టుకు విన్నవించారు. పాఠశాలలో, కళాశాల్లలో సమానత్వం, సమగ్రతకు భంగం కలిగించే దుస్తులను నిషేధిస్తూ కర్ణాటక రాష్ట్రప్రభుత్వం ఫిబ్రవరి 5 నాటి ఉత్తర్వుల్లోని అంశాలను సుప్రీంకోర్టుకు వివరించారు ప్రభుత్వం తరుపున న్యాయవాదులు.
ఈ కేసును ముందుగా రాజ్యాంగ ధర్మాసనానికి రిఫర్ చేయాలని పలువురు డిమాండ్ చేశారు. విద్యాసంస్థల్లో హిజాబ్ ధరించడాన్ని సమర్థిస్తూ కొందరు వ్యక్తులు ఆందోళనలు చేయడం ఓ పథకంలో భాగమని ప్రభుత్వం తరఫున న్యాయవాదులు సుప్రీంకోర్టుకు తెలిపారు. మార్చి 15న కర్ణాటకలోని ఉడుపిలోని ప్రభుత్వం ప్రీ యూనివర్సిటీ గర్ల్స్ కాలేజీకి చెందిన ముస్లిం విద్యార్థులు తరగతి గదులలో హిజాబ్ ధరించడానికి అనుమతి కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు కొట్టేసింది. ఈ హిజాబ్ వివాదం ఉడుపి నుంచి కర్ణాటకలోని చిక్ మంగళూర్, మాండ్యా, బాగల్ కోట్, దక్షిణ కన్నడ జిల్లా, బెంగళూర్, తుముకూరు, చిక్ బల్లాపూర్, శివమొగ్గ జిల్లాలకు కూడా వ్యాపించింది.