రాజకీయ పార్టీల ఉచితాలపై 2013లో బాలాజీ సుబ్రహ్మణ్యం కేసులో ఇచ్చిన తీర్పు పునః పరిశీలన చేసేందుకు సుప్రీంకోర్టు ఆమోదించింది. తదుపరి ప్రధాన న్యాయమూర్తి బెంచ్ ఏర్పాటు చేసే విషయంపై నిర్ణయం తీసుకుంటారని జస్టిస్ ఎన్‌వీ రమణ ధర్మాసనం తెలిపింది. ఈ విషయంపై కొత్త ప్రధాన న్యాయమూర్తి ముగ్గురు సభ్యులతో కూడిన ధర్మాసనం ఏర్పాటు చేస్తారని చెప్పింది. ఉచితాల కేసు విచారణను నాలుగు వారాల పాటు వాయిదా వేసింది. ఉచిత హామీల అమలు సాధ్యాసాధ్యాలపై నిపుణుల కమిటీ ఏర్పాటుకు సుప్రీంకోర్టు ఆదేశించింది. ఉచితహామీలపై అఖిలపక్షం ఏర్పాటుకుకేంద్రానికి మరోమారు సుప్రీంసూచన చేసింది.
అయితే ప్రజాప్రయోజనాలను కోర్టు దృష్టికి తీసుకువచ్చి చర్చ జరిగేందుకు కృషి చేసిన న్యాయవాదులు ఎంఎల్ శర్మ, అశ్వనీ ఉపాధ్యాయలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు సీజేఐ ఎన్‌వీ రమణ.
న్యాయవాదుల భావోద్వేగం..
జస్టిస్ ఎన్‌వీ రమణ పదవీవిరమణ సందర్భంగా సుప్రీంకోర్టు న్యాయవాదులు భావోద్వేగం చెందారు. ఆయన పనితీరుపై ప్రశంసల వర్షం కురిపించారు. జస్టిస్ ఎన్‌వీ రమణ సీజేఐగా ఉన్నత ప్రమాణాలు నెలకొల్పారని, న్యాయవ్యవస్థకు ఆయన చేసిన సేవలు మరవలేనివి అని న్యాయవాదులు కొనియాడారు.
చరిత్రలో తొలిసారిగా..
సుప్రీంకోర్టు చరిత్రలో తొలిసారిగా కార్యకలాపాలు ప్రత్యక్ష ప్రసారం అయ్యాయి. సీజేఐ జస్టిస్ ఎన్‌వీ రమణ పదవీ విరమణ చేయనున్న ఆగస్టు 26న సుప్రీంకోర్టు లైవ్ ప్రొసీడింగ్స్ ప్రారంభమయ్యాయి. సీజేఐ జస్టిస్ ఎన్‌వీ రమణ.. భారత తదుపరి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యుయు లలిత్, జస్టిస్ హిమా కోహ్లీతో బెంచ్‌ను పంచుకున్నారు.
ఇవీ చదవండి: భారత్‌లో 90 వేలకు చేరిన కరోనా యాక్టివ్ కేసులు, పెరిగిన మరణాలు
రైల్వే ఎగ్జామ్ కోసం బ్లేడుతో బొటనవేలి చర్మాన్ని తొలగించి, స్నేహితుడి వేలికి అతికించి