Supreme Court live hearing India : సుప్రీంకోర్టులో జరిగే కేసుల విచారణను ఇక సామాన్య పౌరులు సైతం ప్రత్యక్షంగా వీక్షించవచ్చు. న్యాయస్థానం కార్యకలాపాలను లైవ్ ద్వారా ప్రసారం చేసేందుకు రంగం సిద్ధమైంది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్ నేతృత్వంలో మంగళవారం జరిగిన ఫుల్ కోర్ట్ సమావేశంలో ఈమేరకు నిర్ణయించారు. విచారణ ప్రత్యక్ష ప్రసారంపై న్యాయమూర్తులంతా ఏకాభిప్రాయం వ్యక్తం చేయగా.. సుప్రీంకోర్టు సిబ్బంది అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. వచ్చే వారం(సెప్టెంబర్ 27) నుంచి కేసుల విచారణ లైవ్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. తొలుత రాజ్యాంగ ధర్మాసనం కేసుల్ని మాత్రమే ప్రత్యక్ష ప్రసారం చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.
వాస్తవానికి సుప్రీంకోర్టు ప్రొసీడింగ్స్ ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు 2018లోనే అనుమతి లభించింది. రాజ్యాంగం, జాతీయ ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకొని.. అప్పట్లో రాజ్యాంగ ధర్మాసనం ముందుకు వచ్చే కొన్ని కేసుల ప్రత్యక్ష ప్రసారానికి అంగీకారం తెలిపింది సర్వోన్నత న్యాయస్థానం. సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం చేపట్టే ముఖ్యమైన కేసులను మొదట ప్రత్యక్షప్రసారం చేయవచ్చని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ గతంలో సూచించారు. జస్టిస్ ఎన్వీ రమణ 2021 ఏప్రిల్‌లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రత్యక్ష ప్రసారం చేసే అంశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లారు. లైవ్ విషయంలో న్యాయమూర్తుల మధ్య ఏకాభిప్రాయ సాధనకు కృషి చేశారు.
Supreme Court live streaming : సీజేఐగా జస్టిస్ ఎన్వీ రమణ పదవీ విరమణ రోజైన ఆగస్టు 26న కీలక ముందడుగు పడింది. సుప్రీంకోర్టు చరిత్రలో తొలిసారిగా కార్యకలాపాలు ప్రత్యక్ష ప్రసారం అయ్యాయి. జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ యూయూ లలిత్, జస్టిస్ హిమా కోహ్లీతో కూడిన త్రిసభ్య ధర్మాసనం కార్యకలాపాల్ని లైవ్ ఇచ్చారు. రాజకీయ పార్టీల ఉచిత హామీలు, కర్ణాటకలో ఇనుప గనుల మైనింగ్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్య నాథ్ వివాదాస్పద వ్యాఖ్యల కేసుల విచారణను ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రజలు వీక్షించే అవకాశం కల్పించారు.