కొలీజియం వ్యవస్థ.. ఈ దేశం రూపొందించిన చట్టమని.. దీన్ని తప్పనిసరిగా పాటించాల్సిందేనని ఇందులో రెండో అభిప్రాయానికి తావు లేదని కేంద్రానికి సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి కొలీజియం సిఫార్సు చేసిన పేర్లను ఆమోదించడంలో కేంద్రం జాప్యం చేస్తోందంటూ దాఖలైన పిటిషన్లపై గురువారం జస్టిస్ ఎస్.కె.కౌల్, జస్టిస్ అభయ్ ఎస్.ఓకా, జస్టిస్ విక్రమ్‌నాథ్‌ల ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా, రాజ్యాంగబద్ధమైన పదవుల్లో పనిచేస్తున్న వారు కొలీజియం వ్యవస్థపై వ్యాఖ్యలు చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. అలాంటి వారిని నియంత్రించాలని అటార్నీ జనరల్(ఏజీ) ఆర్.వెంకటరమణికి తెలిపింది. ఇటీవల కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కడ్ కొలీజియం వ్యవస్థకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారు.
''సుప్రీంకోర్టుకు న్యాయసమీక్ష అధికారం లేదని ప్రభుత్వంలోని రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్నవారే చెబుతున్నారు. రేపు రాజ్యాంగ మౌలిక స్వరూపం కూడా రాజ్యాంగంలో లేదని అంటారు. కొలీజియం వ్యవస్థకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలపై మాకు అభ్యంతరం ఉంది. నియంత్రణ పాటించాలని వారికి సలహా ఇవ్వండి'' అని ఏజీకి ధర్మాసనం సూచించింది.
తుది నిర్ణేత.. న్యాయస్థానమే
కొలీజియం.. రాజ్యాంగ ధర్మాసనం ఆమోదించిన వ్యవస్థ అని, కొన్ని వర్గాలు దీనికి వ్యతిరేకంగా అభిప్రాయాలు వ్యక్తం చేసినంత మాత్రానా.. అది చట్టం కాకుండా పోదని న్యాయమూర్తులు పేర్కొన్నారు. ''పార్లమెంటులో చేసిన చట్టాలను కూడా సమాజంలో కొన్ని వర్గాలు అంగీకరించవు. అలాగని క్షేత్రస్థాయిలో వాటి అమలును న్యాయస్థానాలు నిలిపివేయాలా'' అని ఏజీని ధర్మాసనం ప్రశ్నించింది. ''ఏ చట్టాన్ని పాటించాలి.. పాటించకూడదన్న విషయాన్ని సమాజంలోని వ్యక్తులకు విడిచిపెడితే మొత్తం వ్యవస్థే కుప్పకూలిపోతుంది'' అని జస్టిస్ ఎస్.కె.కౌల్ హెచ్చరించారు.
పునరుద్ఘాటించిన పేర్లను రెండు సందర్భాల్లో కొలీజియం వెనక్కితీసుకుందని, దీని ప్రకారం చూస్తే సుప్రీంకోర్టుకే స్పష్టత లేదన్న అనుమానాలు తలెత్తుతున్నాయని అటార్నీ జనరల్ చేసిన వ్యాఖ్యలపై ధర్మాసనం మండిపడింది. అలాంటి అరుదైన సందర్భాలను ఆధారంగా చేసుకొని పునరుద్ఘాటించిన పేర్లను తప్పనిసరిగా ఆమోదించాలన్న రాజ్యాంగధర్మాసనం ఉత్తర్వులను విస్మరించే అధికారం ప్రభుత్వానికి లేదని పేర్కొంది. ఇటీవల కేంద్రం 19 పేర్లను తిరిగి పంపిన విషయాన్ని ధర్మాసనం ప్రస్తావించింది. ఇందులో పది.. పునరుద్ఘాటించిన పేర్లేనని తెలిపింది.
''ఈ విషయంలో సీనియర్ న్యాయ అధికారిగా అటార్నీ జనరల్ తనవంతు పాత్ర పోషించాలి. న్యాయపరంగా ఉన్న స్థితిని ప్రభుత్వానికి వివరించాలి. చట్టానికి సంబంధించి ఈ న్యాయస్థానమే తుది నిర్ణేత. చట్టాలు చేసే అధికారం పార్లమెంటుకు ఉంది. కానీ అవన్నీ న్యాయస్థానాల సమీక్షకు లోబడి ఉండాలి. ఈ కోర్టు నిర్దేశించిన చట్టాలను అందరూ అనుసరించాలి'' అని ధర్మాసనం చెప్పింది. హైకోర్టుల్లో తాత్కాలిక న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి కేంద్రం జారీ చేసిన ప్రక్రియ గందరగోళంగా ఉందని దీన్ని మరింత సరళతరం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది.