ఎన్నికల అభ్యర్థుల నేర రికార్డులకు సంబంధించి కోర్టు ఆదేశాలను ధిక్కరించినందుకు గానూ భాజపా, కాంగ్రెస్ సహా 9 రాజకీయ పార్టీలకు సుప్రీంకోర్టు జరిమానా విధించింది. గతేడాది బిహార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కోర్టు ఆదేశాల ప్రకారం తమ అభ్యర్థుల నేర చరిత్రను బహిర్గతం చేయనందుకుగానూ భాజపా, కాంగ్రెస్, మరో ఐదు పార్టీలకు రూ. లక్ష చొప్పున, సీపీఎం, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లకు రూ. 5లక్షల చొప్పున జరిమానా విధిస్తున్నట్లు న్యాయస్థానం మంగళవారం తీర్పు వెలువరించింది.
భవిష్యత్తులో ఈ విషయానికి సంబంధించి జాగ్రత్తగా ఉండాలని కోర్టు ఈ సందర్భంగా రాజకీయ పార్టీలను హెచ్చరించింది. కోర్టు ఆదేశించినట్లుగా పార్టీలు తమ అభ్యర్థుల నేర చరిత్ర వివరాలను తమ వెబ్‌సైట్లలో అప్‌లోడ్ చేయాలని స్పష్టం చేసింది. అంతేగాక, ఓటర్లు ఈ వివరాలు సులువుగా తెలుసుకునేందుకు వీలుగా ఓ మొబైల్ యాప్ రూపొందించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.
రాజకీయాల్లో నేర చరితను తగ్గించే దిశగా సుప్రీంకోర్టు మంగళవారం సంచలన తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో అభ్యర్థులను ఎంపిక చేసిన 48 గంటల్లోగా వారి క్రిమినల్ కేసులకు సంబంధించిన వివరాలను ఆయా పార్టీలు ప్రజలకు బహిర్గతం చేయాలని ఆదేశించింది. నిజానికి గతేడాది బిహార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే కోర్టు ఈ తరహా తీర్పునిచ్చింది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు 48 గంటల్లో తమ నేర చరిత్రకు సంబంధించిన వివరాలను వెల్లడించాలని.. లేదంటే కనీసం నామినేషన్ దాఖలు చేయడానికి అనుమతించిన తేదీకి రెండు వారాల ముందు ఈ వివరాలను బహిర్గతం చేయాలని ఆదేశించింది. తాజాగా దాన్ని కేవలం 48 గంటలకు పరిమితం చేస్తూ తీర్పు వెలువరించింది.
అయితే బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు ముందే సుప్రీం ఈ ఆదేశాలు జారీ చేయగా.. చాలా రాజకీయ పార్టీలు వాటిని పాటించలేదు. దీనిపై సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. అభ్యర్థుల నేర చరిత్ర వెల్లడించని పార్టీల గుర్తులను నిలిపివేయాలని పిటిషనర్లు కోరారు. వీటి విచారణ సందర్భంగానే న్యాయస్థానం.. ఆయా రాజకీయ పార్టీలకు జరిమానాలు విధించింది. మరోపక్క కోర్టు ఆదేశాల్ని పాటించనందుకు సీపీఐ(ఎం), నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ బేషరతుగా కోర్టుకు క్షమాపణలు తెలియజేశాయి. అలాగే కోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఆ పార్టీల గుర్తుల్ని నిలిపివేస్తామంటూ ఎన్నికల సంఘం కోర్టుకు వెల్లడించింది.
ఇదీ చూడండి: గాంధీలు లేకుండా విపక్ష నేతలకు సిబల్ విందు- దేనికి సంకేతం?