ఉత్తర్ప్రదేశ్ లఖింపుర్ ఖేరిలో అక్టోబర్ 3న జరిగిన హింసాత్మక ఘటనపై విచారణ చేపట్టింది సుప్రీం కోర్టు. ఈ కేసు దర్యాప్తులో ఉత్తర్ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు సంతృప్తికరంగా లేవని అసహనం వ్యక్తం చేసింది. ఈ కేసులో సీబీఐ విచారణ ఒక్కటే పరిష్కారం కాదని పేర్కొంది. దీనిని.. ఎనిమిది మందిని అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటనగా పేర్కొంది.
ఈ ఘటనపై ఉన్నత స్ధాయి విచారణ జరిపించాలంటూ దాఖలైన పిటిషన్‌లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం వరుసగా రెండో రోజు విచారణ జరిపింది. ఈ ఘటనపై వందల ఈ-మెయిళ్లు వస్తున్నాయని తెలిపారు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ. అందరికీ సమయం ఇవ్వలేమని, తొలుత రాష్ట్ర ప్రభుత్వం వాదనలు వింటామని చెప్పారు.
ఉత్తర్ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే వాదనలు వినిపించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాకు నోటీసులు పంపామని, శనివారం ఉదయం 11 గంటలకు విచారణకు హాజరవుతారని కోర్టుకు తెలిపారు. అతను హాజరుకాకపోతే.. చట్టం తన పని తాను చేసుకుపోతుందని స్పష్టం చేశారు.
ఎఫ్ఐఆర్ నమోదు చేసిన నిందితుడిని ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించింది ధర్మాసనం. అరెస్టు చేయకుండా యూపీ.. ఏం సందేశం ఇస్తోందని పేర్కొంది. హత్యా నేరం నమోదు చేసిన ఇతర నిందితుల పట్ల కూడా అదే తరహాలో వ్యవహరిస్తున్నారా? అని ప్రశ్నించింది. బాధ్యతాయుతమైన ప్రభుత్వం, పోలీసులను చూడాలనుకుంటున్నామని పేర్కొంది. ఘటనకు సంబంధించిన ఆధారాలు, ఇతర వస్తువులను ధ్వంసం చేయకుండా చర్యలు చేపట్టేలా యూపీ డీజీపీకి సూచించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది హరీశ్ సాల్వేకు ధర్మాసనం సూచించింది.
దీనిపై తదుపరి విచారణను అక్టోబర్ 20కి వాయిదా వేసింది.