Mohammad Zubair Bail: హిందూ దేవతను అవమానించాడన్న ఆరోపణలతో అరెస్ట్ అయిన ప్రముఖ జర్నలిస్ట్, ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు మహ్మద్ జుబైర్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆయనకు 5 రోజుల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది న్యాయస్థానం. ఉత్తర్‌ప్రదేశ్‌లోని సీతాపుర్‌లో ఆయనపై కొద్దిరోజుల ముందు కేసు నమోదైన కేసులో ఈ బెయిల్ ఇచ్చింది. అలహాబాద్ హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ జుబైర్ దాఖలు చేసిన పిటిషన్‌పై.. ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులకు నోటీసులు జారీ చేసింది అత్యున్నత న్యాయస్థానం.
అంతకుముందు.. జులై 2న మహమ్మద్ జుబైర్‌ను దిల్లీ పోలీసులు న్యాయస్థానం ముందు హాజరుపర్చారు. ఐదు రోజుల కస్టడీ పూర్తిచేసుకున్న నేపథ్యంలో 14రోజుల జ్యుడిషియల్ కస్టడీకి అప్పగించాలని న్యాయస్థానం ఆదేశించింది. జుబైర్‌పై నమోదైన కేసులకు.. నేరపూరిత కుట్ర, ఆధారాల ధ్వంసం సహా విదేశీ విరాళాల చట్టం ప్రకారం మరిన్ని సెక్షన్లను చేర్చినట్లు పోలీసులు వివరించారు. పోలీసుల వాదనలను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం.. జుబైర్‌కు జ్యుడిషియల్ కస్టడీ విధించింది.
అదే సమయంలో బెయిల్ కోసం జుబైర్ దరఖాస్తు చేసుకున్నారు. తన విచారణ పూర్తైన నేపథ్యంలో బెయిల్ ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరారు. పోలీసులు సీజ్ చేసిన ఫోన్ నుంచి తాను ఆ ట్వీట్ చేయలేదని స్పష్టం చేశారు. కానీ జుబైర్ అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చి బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది.
గత నెల 27న.. 2018లో హిందూదేవతపై అభ్యంతరకర పోస్టు చేశారన్న ఆరోపణలపై ఆయన్ను పోలీసులు అరెస్టు చేశారు. జుబైర్ చేసిన ట్వీట్ వల్ల ట్విట్టర్లో విద్వేష ప్రసంగాలు వెల్లువెత్తాయంటూ దిల్లీ పోలీసులు చెప్పుకొచ్చారు. మతసామరస్యాన్ని దెబ్బతీసే పరిస్థితులు ఏర్పడ్డాయని తెలిపారు.
యాంకర్ రోహిత్ రంజన్‌కు సుప్రీం ఊరట.. రాహుల్‌గాంధీపై తప్పుడు వీడియోను ప్రసారం చేసిన కేసుల్లో తనపై బలవంతంగా చర్యలు తీసుకోకుండా రక్షణ కల్పించాలంటూ సుప్రీంను ఆశ్రయించిన యాంకర్ రోహిత్ రంజన్‌కు కూడా ఊరట దక్కింది. రోహిత్ రంజన్ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ జేకే మహేశ్వరితో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. అతడిపై ఎటువంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని సంబంధిత అధికారులను అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.
వివాదం ఏంటంటే.. కేరళలోని వయనాడ్‌లో తన కార్యాలయంపై దాడి చేసినవారిని చిన్నపిల్లలుగా పేర్కొంటూ, వారికి వ్యతిరేకంగా తనకు ఎలాంటి దురుద్దేశం లేదని రాహుల్‌గాంధీ ఇటీవల వీడియో సందేశమిచ్చారు. ఓ టీవీ ఛానల్ ఈ వీడియోను వక్రీకరించి.. రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌కు చెందిన టైలర్ కన్హయ్యలాల్ హంతకులను ఉద్దేశించి రాహుల్ ఈ వ్యాఖ్యలు చేసినట్టు పేర్కొంది. పొరపాటు జరిగిందంటూ ఆ తర్వాత క్షమాపణలు చెప్పింది. అయితే, కాంగ్రెస్ ఎమ్మెల్యే దేవేంద్ర యాదవ్ ఫిర్యాదు మేరకు ఆ టీవీ ఛానల్ యాజమాన్యంతో పాటు యాంకర్ రోహిత్ రంజన్‌పైనా రాయ్‌పుర్ పోలీసులు కేసు నమోదు చేశారు. రాహుల్‌పై తప్పుడు వీడియోను సామాజిక మాధ్యమంలో పెట్టినందుకు భాజపాకు చెందిన ముగ్గురు ఎంపీలు, ఓ ఎమ్మెల్యేతో కలిపి మొత్తం అయిదుగురిపై ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పుర్ సహా పలు రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి.
ఇవీ చదవండి: మరోసారి సుప్రీంకు ఉద్ధవ్ వర్గం.. శిందే నియామకంపై సవాల్