'పీఎంకేర్స్'కు ఎంపీలు ఇచ్చిన పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధి నిధులను (ఎంపీలాడ్స్) తిరిగి వెనక్కు ఇచ్చేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ వ్యాజ్యానికి విచారణ యోగ్యత లేదని పేర్కొంది. తుషార్ గుప్త అనే వ్యక్తి ఈ పిటిషన్ వేశారు.
"నియోజకవర్గాల్లో సమాజానికి ఉపయోగపడే అభివృద్ధి పనులు చేపట్టే ఉద్దేశంతో ఎంపీలాడ్స్ పథకాన్ని ప్రవేశపెట్టారు. కానీ, కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు... నిబంధనలకు విరుద్ధంగా మొత్తం రూ.365 కోట్లను పీఎం కేర్స్‌కు మళ్లించారు. తాగునీరు, ప్రాథమిక విద్య, ప్రజారోగ్యం, పారిశుద్ధ్యం, రహదారుల నిర్మాణం వంటి సదుపాయాల కోసం వెచ్చించాల్సిన ఈ నిధులను మళ్లించడం సరికాదు" అని పిటిషన్‌లో పేర్కొన్నారు తుషార్.
మంగళవారం ఈ వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎ.బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున దుష్యంత్ తివారి వాదనలు వినిపించారు. సమాచార హక్కు చట్టం కింద అందిన సమాధానాన్ని ప్రస్తావిస్తూ... ఎంపీలాడ్స్ మళ్లింపు కారణంగా నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు నిలిచిపోయాయన్నారు.
ఇదీ చూడండి: 'పీఎం కేర్స్'పై మోదీకి మాజీ అధికారుల లేఖ