Chandrababu Naidu FiberNet Case: ఫైబర్ నెట్ కేసులో తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌పై, సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. సెక్షన్ 17ఏపై తీర్పు పెండింగ్ దృష్ట్యా, ఫైబర్ నెట్ కేసును జనవరి 17కు వాయిదా వేస్తూ, సుప్రీం కోర్టు నిర్ణయం తీసుకుంది. అప్పటి వరకూ ఈ కేసు విషయాలపై ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దని, ప్రభుత్వంతో పాటుగా చంద్రబాబుకు సూచించింది. కేసు విషయంలో సంయమనం పాటించాలని ఇరువర్గాలకు సుప్రీంకోర్టు సూచనలు చేసింది.
కేసు విషయాలపై చంద్రబాబు బహిరంగంగా మాట్లాడుతున్నారన్నారని ప్రభుత్వ న్యాయవాది సుప్రీంకు తెలిపారు. జైలుకు పంపిన విషయాలపైన, చంద్రబాబు మాట్లాడుతున్నారని వెల్లడించారు. చంద్రబాబు బహిరంగంగా మాట్లాడకుండా, ఆంక్షలు విధించాలని ప్రభుత్వ తరఫు న్యాయవాది సుప్రీం కోర్టును కోరారు. ప్రభుత్వ తరఫు న్యాయవాది ఆరోపణలపై, చంద్రబాబు తరఫు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా స్పందించారు. చంద్రబాబు కోర్టు నిబంధనలకు విరుద్ధంగా, ఎక్కడా మాట్లాడలేదని పేర్కొన్నారు. ప్రభుత్వం తరఫునే సీఐడీ, దిల్లీ సహా పలు ప్రదేశాల్లో ప్రెస్‌మీట్ పెట్టారని లూథ్రా కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అదనపు ఏజీ, సీఐడీ డీజీ మీడియా సమావేశాలు పెట్టారని వెల్లడించారు. మీడియా సమావేశాలు నిర్వహించడం పూర్తిగా తప్పని, మీడియా సమావేశాల్లో నిరాధార ఆరోపణలు చేశారని, సిద్ధార్థ లూథ్రా ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. ప్రభుత్వాధికారుల వ్యాఖ్యలతో పోలిస్తే చంద్రబాబు ఎక్కడా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని తెలిపారు.
ఇరు వర్గాల ఆరోపణల నేపథ్యంలో చంద్రబాబు, ఏజీ, సీఐడీ డీజీ వ్యాఖ్యానించినట్లు ఉన్న ఆధారాలను కోర్టు ముందుంచాలని ఇరువురికి సుప్రీం కోర్టు సూచించింది. ఫైబర్ నెట్ కేసులోనూ ఇరుపక్షాలు బహిరంగ వ్యాఖ్యలు చేయవద్దని ధర్మాసనం స్పంష్టం చేసింది. ఈ కేసు విచారణను జనవరి 17న మధ్యాహ్నం 3 గం.కు విచారణ చేపడతామని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. సెక్షన్ 17ఏపై తీర్పు పెండింగ్ దృష్ట్యా ఫైబర్ నెట్ కేసును సుప్రీం కోర్టు మరోసారి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.