యాజమానులు అమలుచేసే ఉద్యోగ నియమ నిబంధనలు చట్టాలకు అనుగుణంగా, లేకుంటే వాటిపై ఉద్యోగులు న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చని శుక్రవారం సుప్రీంకోర్టు తెలిపింది. ఓ విశ్వవిద్యాలయానికి చెందిన ఫార్మాస్యూటికల్ విభాగం 2011లో జారీ చేసిన ఉద్యోగ ప్రకటనలోని అంశాలు, నియామక పత్రంలో పేర్కొన్న నిబంధనలను సవాలు చేస్తూ అధ్యాపకులు వేసిన దావాను న్యాయమూర్తులు జస్టిస్ యు.యు.లలిత్, జస్టిస్ అజయ్ రస్తోగిలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ నిబంధనలను సవాలు చేసే అధికారం ఉద్యోగులకు ఉందని తెలిపింది.
"యజమానులు ఎల్లప్పుడు నిర్ణయాత్మక స్థానంలో ఉంటారన్నది చెప్పాల్సిన పనిలేదు. ఉద్యోగాలకు సంబంధించిన విధివిధానాలను వారే నిర్దేశిస్తారు. ఈ నిబంధనలు ఎంత అహేతుకంగా ఉన్నప్పటికీ వాటిపై ఉద్యోగులు ఫిర్యాదు చేసే అవకాశం ఉండదు. అయితే ఉద్యోగానికే ముప్పు కలిగించే విధంగా నిబంధనలు ఉంటే వాటిని ఉద్యోగులు ప్రశ్నించవచ్చు. వాటిలోని న్యాయపరమైన అంశాలను కోర్టు పరిగణనలోకి తీసుకుంటుంది. నియామక ఉత్తర్వు తీసుకున్నందున అందులోని నిబంధనలను ఉద్యోగి ఆమోదించినట్టేనని, వాటిని అమలు చేయాల్సిందేనన్న వాదన సరికాదు.. యాజమాని విధించే నిబంధనలు అంగీకరించక తప్పని పరిస్థితి ఉద్యోగికి ఉంటుంది. ఈ విషయంలో బేరమాడే శక్తి వారికి ఉండదు. కానీ, ఈ నిబంధనలు చట్టానికి అనుగుణంగా లేవని భావిస్తే వాటిని సవాలు చేయవచ్చు" అని సుప్రీంకోర్టు తెలిపింది. ఆ విశ్వవిద్యాలయం తొలుత రాష్ట్ర పరిధిలో ఉన్నప్పుడు కొంతమంది సరయిన నియామక పద్ధతుల్లోనే తాత్కాలిక అధ్యాపకులుగా ఉద్యోగాలు పొందారు. పోస్టులను రెగ్యులర్ చేసినప్పుడు శాశ్వత ఉద్యోగాలు లభించే అవకాశం వారికి ఉంది. అయితే దాన్ని కేంద్ర విశ్వ విద్యాలయంగా మార్చినప్పుడు, కొత్త నిబంధనలు వచ్చాయని పేర్కొంటూ తాజా నియామకాల కోసం ప్రకటన ఇచ్చారు. దీన్ని సవాలు చేస్తూ వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
ఇదీ చదవండి:'మీరు ఆ పని చేసేసరికి థర్డ్‌వేవ్ కూడా వెళ్లిపోతుంది'