అయోధ్యలోని రామ మందిరాన్ని(Ayodhya Ram Mandir Construction) అద్భుతమైన హంగులతో నిర్మిస్తున్నారు. ప్రతి శ్రీరామ నవమి రోజున 'రామ్ లల్లా' ప్రతిమపై సూర్యకిరణాలు పడి, గర్భగుడి అంతటా ప్రకాశించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. 13వ శతాబ్దంలో నిర్మించిన ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం స్ఫూర్తితో దీన్ని(Ayodhya Ram Mandir Construction) రూపొందిస్తున్నారు. ఈ మేరకు శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్(Shree Ram Janmabhoomi Teerth Kshetra) సభ్యుడు కామేశ్వర్ చౌపాల్ తెలిపారు. ఈ డిజైన్‌కు సంబంధించిన పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. శాస్త్రవేత్తలు, జ్యోతిషులు, సాంకేతిక నిపుణులు ఈ పనుల్లో నిమగ్నమయ్యారని పేర్కొన్నారు.
"ఆలయంలోకి సూర్యకిరణాలు చేరేందుకు ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం ఉదాహరణ. అదే తరహాలో రామ మందిరంలోని గర్భగుడిలో సూర్యకిరణాలు ప్రకాశించేలా ఏర్పాట్లు చేస్తున్నాం. కోణార్క్ సూర్యదేవాలయంలో ఎలాంటి సాంకేతికతను వినియోగించారనే అంశంపై అధ్యయనం చేస్తున్నాం."
-కామేశ్వర్ చౌపాల్, శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సభ్యుడు
అయోధ్య రామమందిర నిర్మాణంలో సాంకేతిక అంశాలపై పని చేసేందుకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ సహా ఐఐటీ దిల్లీ, ఐఐటీ రూర్కీ, ఐఐటీ ముంబయికి చెందిన నిపుణులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసినట్లు కామేశ్వర్ తెలిపారు.
2023 డిసెంబర్ నాటికి..
మరోవైపు.. ఆలయ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని ఆలయ ట్రస్ట్‌కు చెందిన సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. 2023 డిసెంబర్ నాటికి భక్తులు దర్శించుకునేందుకు అనుమతి కల్పిస్తామని చెప్పారు. మొదటి దశ పనులు ఇప్పటికే పూర్తయ్యాయని.. నవంబర్ మధ్య నాటికి రెండో దశ పనులు పూర్తవుతాయని చెప్పారు. భౌగోళిక పర్యావరణ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని నిర్మాణ పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు.
"నవంబర్ 15 నుంచి పునాది పనులు ప్రారంభిస్తాం. పిల్లర్ల నిర్మాణం, పిల్లర్లపై ఓవర్‌హెడ్ నిర్మాణం 2022 ఏప్రిల్ నుంచి ప్రారంభించే అవకాశం ఉంది" అని కామేశ్వర్ చౌపాల్ తెలిపారు. ముందుగా అనుకున్న డిజైన్లలో కొన్ని మార్పులు చేసినట్లు చెప్పారు. అంతకుముందు రెండు అంతస్తుల్లోనే ఆలయ నిర్మాణం చేపట్టాలని భావించగా.. దాన్ని మూడు అంతస్తులకు మార్చినట్లు వివరించారు.
ఇదీ చూడండి: '2024 ఎన్నికలకు ముందే అయోధ్య రాముని దర్శనం'