నటి, మండ్య స్వతంత్ర ఎంపీ సుమలత అంబరీశ్.. ప్రధాని నరేంద్ర మోదీకి పూర్తి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. మోదీ నాయకత్వంలో భారత్ స్థిరంగా ఉందని.. ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతిని సంపాదించిందని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు శుక్రవారం తెలిపారు. తన అనుచరులు, శ్రేయోభిలాషులతో చర్చించిన తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చినట్లు సుమలత చెప్పారు. మైసూరు-బెంగళూరు మధ్య పది వరసల ఎక్స్‌ప్రెస్ వే ప్రారంభోత్సవానికి మోదీ ఆదివారం రానున్న నేపథ్యలో.. సుమలత ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో, ఆమె బీజేపీలోకి రావడం లాంఛనమేనని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అయితే, నాలుగేళ్లు స్వంతంత్ర ఎంపీగా ఉండటం వల్ల చాలా సమస్యలు ఎదుర్కొన్నట్లు.. ముఖ్యంగా బహిరంగ సభలు ఏర్పాటు చేయడంలో ఇబ్బందులు ఎదురయ్యాయని సుమలత చెప్పారు. ఈ కారణంగానే తనకూ ఓ సపోర్ట్ అవసరం అని అనుకున్నట్లు తెలిపారు.
'ఎవరు ఏమనుకున్నా.. నాకు నరేంద్ర మోదీ నాయకత్వంపై నమ్మకం ఉంది. ఆయన్ను ప్రపంచవ్యాప్తంగా ప్రశంసిస్తున్నారు. అందుకే బీజేపీకి నా మద్దతు తెలుపుతున్నా. ఈ నిర్ణయం సుమలత కోసం కాదు. మండ్య భవిష్యత్ కోసం. ఆత్మగౌరంలో రాజీపడే బదులు రాజకీయాల నుంచి తప్పుకుంటా. మండ్య కోసం ఈ లోకాన్ని విడిచి వెళ్లడానికే ఇష్టపడతా. నేను రాజకీయాల్లోకి వచ్చింది డబ్బు సంపాదించడానికి కాదు. ఈ జిల్లాలో మార్పు తీసుకురావడానికి.. ఇక్కడి ప్రజల జీవితాలను మెరుగుపరచడానికి. మైసూరు-బెంగళూరు ఎక్స్‌ప్రెస్ వే.. మైసూరులో గాని, బెంగళూరులో గాని ప్రారంభం చేయొచ్చు. కానీ ఆయన మండ్యను ఎంచుకున్నారు. మండ్య జిల్లాకు ఎంత ప్రాధాన్యం ఉందో దీన్ని బట్టి అర్థమవుతోంది. మండ్యలో మార్పు రావాలి. ఇక్కడ అనైతిక వాతావరణం ఉంది. అందుకే ముందుగా మండ్యలో స్వచ్ఛ భారత్ మిషన్ ను చేపడదాం. '
--సుమలత అంబరీశ్, మండ్య స్వతంత్ర ఎంపీ
గత సంవత్సర కాలంగా సుమలత బీజేపీ అధిష్ఠానంతో టచ్‌లో ఉన్నారు. ఇక, కొన్ని రోజులుగా పలు దఫాలు చర్చలు కూడా జరిగాయి. 'విజయ సంకల్ప యాత్ర'లో భాగంగా బెంగళూరుకు వచ్చిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సుమలత గురువారం సుదీర్ఘంగా చర్చించారు. దీంతో ఎలాంటి షరతులతో ఆమె బీజేపీలో చేరనున్నారో అని రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. అదే సమయంలో.. సుమలత తన కుమారుడు అభిషేక్‌కు ఎమ్మెల్యే సీటు ఇవ్వమని అడిగే అవకాశముందని పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
గతంలో.. తాను రాజకీయాల్లో ఉన్నంత వరకు.. తన కుమారుడు రాజకీయాల్లోకి రాడని.. తనకు కుటుంబ రాజకీయాలంటే ఇష్టం ఉండదని.. చాముండేశ్వరి దేవతపై ఒట్టేసి మరీ చెప్పారు సుమలత. అందుకే తన భర్త అంబరీశ్ బతికి ఉన్నప్పుడు తాను రాజకీయాల్లోకి రాలేదని తెలిపారు. ఈ మేరకు, జేడీఎస్ లాంటి పార్టీల్లో ఉన్న వ్యక్తులు తమ కుటంబాల్లోని అందరినీ రాజకీయాల్లోకి తీసుకువస్తున్నారని.. తాను అలాంటి వ్యక్తిని కాదని సుమలత పేర్కొన్నారు. తాను బెంగళూరు నుంచి పోటీ చేస్తానన్న వార్తలను ఆమె తిప్పికొట్టారు.
ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో పుట్టిన సుమలత.. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో పలు సినిమాల్లో నటించారు. ఆ తర్వాత సినీ నటుడు అంబరీశ్‌ను పెళ్లి చేసుకున్నారు. ఆయన చనిపోయిన తర్వాత మండ్య లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి.. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమార స్వామి కుమారుడు నిఖిల్ కుమార స్వామిపై గెలిచారు. ఆ ఎన్నికల్లో సుమలతకు బీజేపీ మద్దతు ఇవ్వడం గమనార్హం.