Suitcase Murder Case: పెళ్లికి నిరాకరించిందనే కోపంతో ప్రియురాలిని హోటల్‌కు తీసుకెళ్లి హత్య చేశాడు ఓ యువకుడు. సూట్‌కేసులో కుక్కి నదిలో పడేసేందుకు యత్నించగా హోటల్ సిబ్బంది పట్టుకున్నారు. వారికి ఆత్మహత్య అంటూ కట్టుకథ చెప్పాడు. అనుమానం వచ్చిన పోలీసులు తమదైశ శైలిలో విచారించగా.. పథకం ప్రకారమే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. ఈ సంఘటన ఉత్తరాఖండ్ రూడ్కీ జిల్లా పిరాన్ కలియార్ ప్రాంతంలో గురువారం రాత్రి జరిగింది.
పోలీసుల వివరాల ప్రకారం: మంగళూరుకు చెందిన రమ్శా అనే యువతిని.. ఆమె దూరపు చుట్టం, గుల్జేబ్కు చెందిన యువకుడు సనవార్ ప్రేమించాడు. ఇరువురు కలిసి గురువారం రాత్రి పిరాన్ కలియార్ ప్రాంతంలోని ఓ హోటల్‌కు వచ్చారు. కొద్ది గంటల తర్వాత పెద్ద సూట్‌కేసుతో హోటల్ నుంచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించాడు. అతని కదలికలపై అనుమానం వచ్చిన సిబ్బంది, స్థానికులు యువకుడిని పట్టుకున్నారు. సూట్‌కేసు తెరిచి చూడగా యువతి మృతదేహం లభ్యమైంది. ఈ క్రమంలో తాము ఆత్మహత్య చేసుకునేందుకే హోటల్‌కు వచ్చామని, ముందుగా తన ప్రేయసి విషం తాగి చనిపోయిందని చెప్పాడు. తన మృతదేహాన్ని నదిలో పడేసి ఆ తర్వాత తానూ ఆత్మహత్య చేసుకునేందుకు ప్రణాళిక చేసుకున్నామని చెప్పాడు. అనుమానపడిన సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు ప్రియుడిని అదుపులోకి తీసుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టానికి తరలించారు.
పక్కా ప్రణాళికతోనే: యువకుడి పొంతనలేని సమాధానాలతో తమదైన శైలిలో విచారించారు పోలీసులు. దీంతో తానే హత్య చేశానని, ఆత్మహత్య ఓ నాటకమని ఒప్పుకున్నాడు. తమ పెళ్లికి యువతి కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదని, వారి మాటకే కట్టుబడి ఉంటానని తనను దూరం పెట్టిందని చెప్పాడు. దీంతో కోపం పెంచుకున్న సనవార్.. హత్యకు పక్కా ప్రణాళిక రచించాడు. ముందుగానే ఓ సూట్‌కేసును కొనుగోలు చేశాడు. యువతి పేరు రమ్శా కాకుండా కాజల్ పేరుతో గుర్తింపుకార్డు చూపించి హోటల్లో గది తీసుకున్నాడు. రాత్రి హోటల్‌కు తీసుకెళ్లి హత్య చేసి.. సూట్ కేసులో కుక్కి పడేసేందుకు ప్రయత్నించి దొరికిపోయాడు. హత్య కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు రూడ్కీ జిల్లా ఎస్పీ ప్రమేంద్ర డోభాల్ తెలిపారు.