దేశంలో మరో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. రష్యా తయారు చేసిన స్పూత్నిక్-వి టీకాను భారత్‌లో అత్యవసర వినియోగానికి అనుమతించాలని నిపుణుల కమిటీ(సీడీఎస్ఎస్ఓ) సిఫార్సు చేసింది. ఈ విషయాన్ని అధికార వర్గాలు స్పష్టం చేశాయి. నిపుణుల కమిటీ సిఫార్సులను డీసీజీఐ ఆమోదిస్తే.. మూడో టీకా రూపంలో స్పుత్నిక్-వి అందుబాటులోకి వస్తుంది.
టీకాకు అనుమతుల విషయంపై సోమవారం భేటీ అయిన నిపుణుల కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. దేశంలో టీకాల కొరత నేపథ్యంలో తాజా ప్రకటన రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
టీకా కొరత
దేశంలో ప్రస్తుతం సీరం ఇనిస్టిట్యూట్ తయారు చేస్తున్న కొవిషీల్డ్, భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకాలను వినియోగిస్తున్నారు. అయితే చాలా రాష్ట్రాల్లో ఆయా టీకాల కొరత ఏర్పడింది. తమకు అత్యవసరంగా టీకాలను పంపాలని వివిధ రాష్ట్రాలు కేంద్రానికి ఇప్పటికే విజ్ఞప్తి చేశాయి.
ప్రముఖ ఔషధ ఉత్పత్తి సంస్థ డాక్టర్ రెడ్డీస్.. భారత్‌లో స్పుత్నిక్-వి టీకా క్లినికల్స్ ట్రయల్స్ నిర్వహిస్తోంది. ఈ టీకాకు సంబంధించి ఇప్పటికే చాలా సమాచారాన్ని సీడీఎస్సీఓ కోరగా డాక్టర్ రెడ్డీస్ సంస్థ అందించినట్లు తెలుస్తోంది.
సుత్నిక్-వి టీకాను ఇప్పటికే అనేక దేశాల్లో వినియోగిస్తున్నారు.
ఇదీ చదవండి : ఖండాంతరాలకు త్రిపుర తేయాకు.. కిలో రూ.12,500