PM Modi tributes to Netaji: స్వాతంత్ర్య సమర యోధుడు, ఆజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా దేశంలోని ప్రముఖులు ఘన నివాళులు అర్పించారు. దేశానికి నేతాజీ చేసిన సేవ చిరస్మరణనీయమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రతి భారతీయుడు ఆయన పట్ల గర్విస్తున్నారని చెప్పారు. నేతాజీ జన్మదినాన్ని పురస్కరించుకొని నిర్వహించుకుంటున్న 'పరాక్రమ్ దివస్' సందర్భంగా దేశ ప్రజలందరికీ మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఆయనకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని ట్వీట్ చేశారు.
పార్లమెంట్ సెంట్రల్ హాలులోని నేతాజీ చిత్రపటానికి ప్రధాని పుష్పాంజలి ఘటించారు. లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ సహా పలువురు మంత్రులు సెంట్రల్ హాలులో నేతాజీకి నివాళి అర్పించారు.
నేతాజీ జయంతి సందర్భంగా ఆయన హోలోగ్రాం విగ్రహాన్ని మోదీ ఆవిష్కరించనున్నారు. ఇండియా గేట్ వద్ద గ్రానైట్‌తో విగ్రహం ఏర్పాటు చేయనున్నట్లు ఇటీవలే ప్రధాని ప్రకటించారు. గ్రానైట్ విగ్రహం నిర్మాణం పూర్తయ్యేంత వరకు.. ఆ ప్రాంతంలో హోలోగ్రాం ప్రతిమ ఉండనుంది.
రాష్ట్రపతి ట్వీట్..
Ramnath kovind Netaji tweet
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సైతం నేతాజీ సుభాష్ జయంతిని స్మరించుకున్నారు. ఈరోజు నుంచి దేశ గణతంత్ర దినోత్సవాలు ప్రారంభమయ్యాయని గుర్తు చేశారు. నేతాజీ ఆదర్శాలు, ఆయన చేసిన త్యాగం దేశ ప్రజల్లో స్ఫూర్తిని నింపుతుందని చెప్పారు. 'నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి సందర్భంగా భారత్ నివాళులు అర్పిస్తోంది. స్వేచ్ఛాయుత భారతదేశం అనే భావనను సాకారం చేసేందుకు ఆయన నిబద్ధతతో వేసిన అడుగుల వల్ల దేశానికి స్ఫూర్తిగా మారారు' అంటూ ట్వీట్ చేశారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం నేతాజీకి నివాళులు అర్పించారు.
సెలవు ఇవ్వండి...: దీదీ
Mamata Banerjee Bose National holiday
నేతాజీ జయంతి సందర్భంగా ఆయన్ను స్మరించుకున్న బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. ఈ రోజును జాతీయ సెలవు దినంగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దేశ ప్రజలంతా బోస్‌కు నివాళి అర్పించేందుకు వీలు కల్పించేలా హాలిడే ఇవ్వాలని సూచించారు. దేశ్‌నాయక్ దివస్‌ను సముచితంగా నిర్వహించాలని కేంద్రానికి పిలుపునిచ్చారు.
ఏడడుగుల సైకత శిల్పం..
బోస్ జన్మదినం పురస్కరించుకొని ఒడిశా పూరీ తీరంలో ప్రముఖ కళాకారుడు సుదర్శన్ పట్నాయక్ ఏడడుగుల ఎత్తైన సైకత శిల్పాన్ని రూపొందించారు. ఇండియా గేట్ వద్ద నూతనంగా నిర్మించ తలపెట్టిన బోస్ విగ్రహ ప్రతిమను పోలి ఉండేలా సైకత శిల్పాన్ని ఏర్పాటు చేశారు.
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చదవండి: ఆంగ్లేయుల నయవంచనకు మౌన సాక్ష్యం 'ఇండియా గేట్'