Attack On Sharad Pawar House: ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌పవార్ ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మహారాష్ట్ర రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన కొంత మంది ఉద్యోగులు ముంబయిలోని శరద్ పవార్ ఇంటివద్దకు చేరుకున్నారు. తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ నినాదాలు చేశారు. ఆయన ఇంటిపై మరికొందరు చెప్పులు, బూట్లు విసిరారు. ఆర్థిక కష్టాలతో సతమతమవుతున్న ఎంఎస్‌ఆర్టీసీని రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేయాలని, తమను ఆదుకోవాలంటూ గతేడాది నవంబర్ నుంచే వేల మంది ఉద్యోగులు సమ్మె బాటపట్టారు.
తాజాగా దాదాపు 100 మంది ఉద్యోగులు శుక్రవారం మధ్యాహ్నం శరద్ పవార్ ఇంటికి చేరారు. ఆయన ఇంటిముందు నిరసన తెలుపుతూ ఎంపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆయన ఇంటిపైకి కొందరు చెప్పులు, బూట్లు కూడా విసిరినట్లు తెలుస్తోంది. 'సమ్మె మొదలైనప్పటి నుంచి దాదాపు 120 మంది ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇవి ఆత్మహత్యలు కాదు.. ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే. ఎంఎస్‌ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే మా డిమాండ్‌కు కట్టుబడి ఉన్నాం. ఈ సమస్య పరిష్కారానికి ఎన్సీపీ అధినేత ఇప్పటివరకు ఏమీ చేయలేదు' అని ఆందోళనలో పాల్గొన్న ఓ ఉద్యోగి పేర్కొన్నారు.
సమ్మె విరమించి ఏప్రిల్ 22లోగా విధుల్లో చేరాలని బాంబే హైకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో పవార్ ఇంటివద్ద వారు ఈ తరహా నిరసన చేపట్టడం గమనార్హం. కోర్టు ఆదేశాలను అనుసరించి, తిరిగి విధుల్లో చేరిన కార్మికులపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి అనిల్ పరబ్ హామీ కూడా ఇచ్చారు. దీనిపై ఉద్యోగులు మాట్లాడుతూ.. 'హైకోర్టు తీర్పును మేం గౌరవిస్తాం. మా సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చేసిందేమీ లేదు. మాకు జరిగిన నష్టాలకు శరద్ పవార్ సైతం బాధ్యత వహించాల్సిందే' అని అన్నారు. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ల మహా వికాస్ అఘాడీ ప్రభుత్వ ఏర్పాటుకు శరద్ పవార్ కీలకంగా వ్యవహరించిన విషయం విదితమే.
ఇదీ చదవండి: 'బుల్డోజర్లు అక్రమార్కుల కోసమే.. పేదవారిపై వాడొద్దు'