కరోనా కేసులు అధికంగా ఉన్న కర్ణాటకలోని పది జిల్లాల్లో విధించిన రాత్రి కర్ఫ్యూ శనివారం అమల్లోకి వచ్చింది. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని అధికారులు తెలిపారు. బెంగళూరు సహా మైసూర్, మంగళూరు, కలబురిగి, బీదర్, తుమకూర్ జిల్లాల్లో కర్ఫ్యూ ఉంటుందని చెప్పారు.
కర్ఫ్యూ నుంచి అత్యవసర సేవలకు మినహాయింపు ఇచ్చారు. నిత్యవసరాలను సరఫరా చేసేందుకు రాత్రి వెళ్లే ఈ-కామర్స్ వాహనాలకు అనుతిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. పరిశ్రమలు, కంపెనీలు రాత్రివేళ పనిచేయవచ్చని, ఉద్యోగులు మాత్రం 10 గంటల లోపే విధులకు వెళ్లాలని సూచించారు. కొవిడ్ నిబంధనలను కఠినంగా అమలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు బెంగళూరు పోలీస్ కమిషనర్ కమల్ పంత్ తెలిపారు.
ముంబయిలో కర్ఫ్యూ ఉల్లంఘన
మహారాష్ట్రలో వారాంతపు లాక్‌డౌన్‌తో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. ముంబయి, పుణె, ఔరంగబాద్, నాగ్‌పుర్ జిల్లాల్లో విజయవంతంగా కర్ఫ్యూ అమలవుతోంది. లాక్డౌన్ విషయంలో ప్రజల నుంచి సానుకూల స్పందన వస్తోందని అధికారులు తెలిపారు.
అయితే పలు ప్రాంతాల్లో ప్రజలు భారీగా గుమిగూడినట్లు తెలుస్తోంది. దాదర్ ఏరియా సహా ముంబయిలోని పలు మార్కెట్లలో ప్రజలు కర్ఫ్యూను ఉల్లంఘించి బయటకు వచ్చారు. మాస్కులుల లేకుండానే తిరుగుతూ కనిపించారు. మద్యం షాపుల ఎదుట బారులు తీరారు.
కాగా.. కొవిడ్ నిబంధనలు అమలు చేసేందుకు పోలీసులు భారీగా మోహరించారు. అత్యవసర సేవలు మినహా బయటకు రావొద్దని ప్రజలకు ముంబయి పోలీసులు సూచించారు.
మధ్యప్రదేశ్‌లో...
మధ్యప్రదేశ్‌లో శుక్రవారం సాయంత్రం అమలులోకి వచ్చిన వారాంతపు లాక్డౌన్.. ప్రశాంతంగా కొనసాగుతోంది. మహారాష్ట్ర సరిహద్దు జిల్లాలైన రాత్లాం, బైతూల్, కాట్నీ, ఖార్గోన్, ఛింద్వాడా సహా ప్రధాన నగరాల్లో కర్ఫ్యూ విజయవంతంగా కొనసాగుతోంది.
రాత్లాం, బైతూల్ జిల్లాల్లో తొమ్మిది రోజులు(ఏప్రిల్ 16 వరకు), ఖార్గోన్, కాట్నీ జిల్లాల్లో ఏడు రోజుల పాటు లాక్డౌన్ ఉండనుంది.
ఇదీ చదవండి: 85రోజుల్లో పది కోట్ల టీకా డోసుల పంపిణీ