భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా బంగాల్ పర్యటన ఉద్రిక్తకరంగా మారింది. కోల్‌కతా నుంచి దక్షిణ 24 పరగణాల జిల్లాలోని డైమండ్ హార్బర్ వైపు వెళ్తుండగా ఆయన వాహనశ్రేణిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాశ్ విజయవర్గీయ, భాజపా నేత దీపాంజన్ గుహ కార్లు కూడా పూర్తిగా ధ్వంసమయ్యాయి. మీడియా వాహనాలూ దెబ్బతిన్నాయి. రోడ్లను మూసివేసేందుకు ప్రయత్నించారు దుండగులు. వారిని చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు పోలీసులు.
ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు భాజపా జాతీయ అధ్యక్షుడు నడ్డా. ఇది ప్రజాస్వామ్యానికి అవమానమని పేర్కొన్నారు.
" మా కాన్వాయ్‌లో దాడి జరగని కారు ఒక్కటి కూడా లేదు. నేను బులెట్‌ప్రూఫ్ కార్లో వెళ్తున్న కారణంగా సురక్షితంగా బయటపడ్డాను. బంగాల్లో ఈ అన్యాయమైన, అసహన స్థితి ముగియాలి. ముకుల్ రాయ్, కైలాశ్ విజయవర్గీయ గాయపడ్డారు. ఇది ప్రజాస్వామ్యానికి అవమానం. 2021లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని నేను నమ్మకంగా చెప్పగలను. కమలం వికసిస్తుంది. "
- జేపీ నడ్డా, భాజపా జాతీయ అధ్యక్షుడు.
టీఎంసీ కార్యకర్తలే ఈ దాడి చేశారని బంగాల్ భాజపా అధ్యక్షుడు దిలీప్ ఘోష్ ఆరోపించారు. భారత రాజకీయ చరిత్రలో ఇది చీకటి రోజుగా అభివర్ణించారు. బంగాల్లో మీడియాకు కూడా భద్రత లేదన్నారు. 'ఈ దాడిలో నేను గాయపడ్డాను. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నా. పోలీసులు ఉన్న సమయంలోనే గూండాలు రేచ్చిపోయారు. సొంత దేశంలోనే ఉన్నామా అన్న భావన కలుగుతోంది.' అని పేర్కొన్నారు కైలాశ్ విజయవర్గీయ.
కేంద్ర హోంశాఖ స్పందన
నడ్డా పర్యటన సందర్భంగా భద్రతా లోపాలతో ఉద్రిక్త పరిస్థితులు చెలరేగటంపై నివేదిక సమర్పించాలని బంగాల్ ప్రభుత్వాన్ని ఆదేశించింది కేంద్రం.
ఇదీ చూడండి: 'కుతుబ్ మినార్'లోని ఆలయాలపై వివాదమేంటి?