హిందూ మహా సముద్రంలో దుందుడుకుగా వ్యవహరిస్తున్న చైనాకు చెక్ పెట్టే.. అస్త్రం భారత నౌకాదళ అమ్ముల పొదిలో చేరింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అత్యాధునిక సాంకేతికతతో తయారు చేసిన ఐఎన్ఎస్ మోర్ముగావ్‌ను.. రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్, సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్, నేవీ చీఫ్ అడ్మిరల్ హరికుమార్.. విధుల్లోకి చేర్చారు. గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్ అయిన ఐఎన్ఎస్ మోర్ముగావ్.. హిందూ మహాసముద్ర జలాల్లో భారత్‌కు వ్యూహాత్మకంగా కీలకంగా మారనుంది. విస్తరణ కాంక్షతో రగిలిపోతున్న చైనాకు.. సముద్ర జలాల్లో ఐఎన్ఎస్ మోర్ముగావ్ కంటిలో నలుసుగా మారుతుందని.. నౌకా దళ అధికారులు తెలిపారు. చైనా చేస్తున్న కుతంత్రాలను సమర్థంగా అడ్డుకునేందుకు భారత నౌక దళ సముద్ర సామర్థ్యాన్ని.. ఐఎన్ఎస్ మోర్ముగావ్ పెంచనుంది. గత దశాబ్ద కాలంలో భారత నౌకాదళం యుద్ధ నౌకల తయారీ.. నిర్మాణ సామర్థ్యంలో సాధించిన పెద్ద పురోగతికి ఈ విజయం నిదర్శనమని భారత నేవీ వెల్లడించింది.
![Stealth guided missile destroyer Mormugao](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17240642_murmuuu.jpg)
![Stealth guided missile destroyer Mormugao](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17240642_murmugoa.jpg)
భారత రక్షణ రంగ చరిత్రలో ఇదో మైలురాయిగా.. భారత నౌక దళం అభివర్ణించింది. ఈ యుద్ధనౌకలో అత్యాధునిక సెన్సార్లు.. ఆధునిక రాడార్లు, ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించే క్షిపణులతో ఐఎన్ఎస్ మోర్ముగావ్ శత్రువులకు భయం పుట్టించేలా ఉంటుంది. 450 కిలోమీటర్ల దూరం వరకు ప్రయోగించగలిగే.. బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణులను కూడా ఐఎన్ఎస్ మోర్ముగావ్ నుంచి ప్రయోగించవచ్చు. ఈ యుద్ధ నౌక నుంచి.. ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించే క్షిపణి వ్యవస్థ, టార్పెడో రాకెట్ లాంచర్లు, అత్యాధునిక మెషిన్‌గన్‌లు.. విస్తృత శ్రేణి రాడార్లు, సెన్సార్లు ఉన్నాయి. 7,400 టన్నుల బరువు, 163 మీటర్ల పొడవు, 17 మీటర్ల వెడల్పు కలిగిన ఐఎన్ఎస్ మోర్ముగావ్.. భారత్ నిర్మించిన అత్యంత శక్తివంతమైన యుద్ధనౌకలలో ఒకటిగా గుర్తింపుపొందింది.
![Stealth guided missile destroyer Mormugao](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17240642_murmu.jpg)
భారత నౌకా దళ వార్‌షిప్ డిజైన్ బ్యూరో స్వదేశీంగా తయారు చేసిన యుద్ధ నౌకల్లో ఐఎన్ఎస్ మోర్ముగావ్ రెండోది. ప్రాజెక్ట్-15బి పేరుతో.. మజాగాన్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ మొత్తం 35,800 కోట్ల రూపాయలతో ఈ యుద్ధనౌకను నిర్మించింది. ఐఎన్ఎస్ మోర్ముగావ్ 30 నాట్‌ల కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించగలదు. న్యూక్లియర్, జీవ, రసాయన యుద్ధ పరిస్థితుల్లోనూ పోరాడేలా ఈ యుద్ధ నౌకను తయారు చేశారు. నిర్దేశించుకున్నలక్ష్యాన్ని కచ్చితత్వంతో ఛేదించేందుకు ఆధునిక నిఘా రాడార్‌ను అమర్చారు. యాంటీ సబ్‌మెరైన్ వార్‌ఫేర్ సామర్థ్యంతోపాటు.. స్వదేశీయంగా అభివృద్ధి చేసిన రాకెట్ లాంచర్‌లు, టార్పెడో లాంచర్లు, హెలికాప్టర్‌లు ఈ యుద్ధనౌకలో ఉన్నాయి.
![Stealth guided missile destroyer Mormugao](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17240642_marmu.jpg)