Selling ashes in Crematorium: పంజాబ్ లూధియానాలో సరికొత్త కుంభకోణం బయటపడింది. ఖన్నా పట్టణానికి చెందిన ఓ ముఠా శ్మశానాలలోని అస్థికలను.. తాంత్రికులకు విక్రయిస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ గ్యాంగ్ ఎన్నో రోజుల నుంచి ఈ బిజినెస్ చేస్తోందని ఖన్నా పోలీసులు తెలిపారు. అస్థికలు, ఎముకలు విక్రయించి.. పెద్ద మొత్తంలో సొమ్ము చేసుకుంటున్నట్లు వెల్లడించారు. ముఠా సభ్యుల్లో కొంతమందిని అరెస్టు చేసిన పోలీసులు.. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు.
Crematorium Ashes bones sell: పట్టణానికి చెందిన రింకూ లఖియా చేసిన ఫిర్యాదుతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. శ్మశానంలో పనిచేసే నిర్మల్ సింగ్ అనే ఉద్యోగి సహా ఓ గుర్తు తెలియని తాంత్రికుడిపై ఆయన ఫిర్యాదు చేశారు. నిర్మల్ సింగ్ కుమారుడి పేరునూ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆరోపణలు ఎదుర్కొంటున్న తండ్రీకొడుకులను అరెస్ట్ చేశారు. తాంత్రికుడి కోసం గాలిస్తున్నారు.
అసలేమైందంటే?
2021 నవంబర్ 3న రింకూ తనయుడు దీపక్(18) చనిపోయాడు. శ్మశానంలో దహన సంస్కారాలు నిర్వహించగా.. దీపక్‌కు సంబంధించిన అస్థికలు పోయాయి. నవంబర్ 5న అస్థికలను సేకరించేందుకు శ్మశానానికి వెళ్లగా.. ఓ ఎముక కనిపించలేదు. షాక్‌కు గురైన రింకూ లఖియా శ్మశానం నిర్వాహకులను నిలదీశాడు. వారు సరైన సమాధానం చెప్పలేదు. సీసీటీవీ దృశ్యాలను పరిశీలించినా ఎలాంటి ఫలితం దక్కలేదు.
వీడియో ప్రూఫ్‌తో ట్రాప్!
దీంతో రింకూ లఖియా.. నిందితుల దారిలో వెళ్లాడు. డబ్బు ఆశ చూపి వారి బాగోతం బయటపడేలా చేశాడు. ఓరోజు నిర్మల్ సింగ్ వద్దకు వెళ్లి.. తనకు ఓ యువకుడి ఎముక కావాలని రింకూ అడిగాడు. అస్థికలు ఇస్తే రూ.50వేలు ముట్టజెప్తానని మాటిచ్చాడు. డబ్బుకు ఆశపడ్డ నిర్మల్ సింగ్.. 27 ఏళ్ల యువకుడి కపాలం, ఎముకలను రింకూకు ఇచ్చాడు. బదులుగా రూ.21 వేలు డిమాండ్ చేశాడు. అతడిని ట్రాప్‌లోనే ఉంచి సంభాషణ అంతా తన ఫోన్లో రికార్డు చేశాడు.
ఇక నిర్మల్ సింగ్.. నిజాలన్నీ బయటకు కక్కేశాడు. శరీరానికి చెందిన అన్ని అస్థికలను రూ.లక్షా 50 వేలకు ఇస్తానని రింకూతో చెప్పాడు. మంత్రాలు కూడా చేస్తానని నమ్మించాడు. శ్మశానంలో క్షుద్ర పూజలు చేసేందుకు సిద్ధమని తెలిపాడు. తనకు తెలిసిన తాంత్రికుడితో దేవుళ్లను ప్రసన్నం చేసుకొని కావాల్సినవి తీసుకుంటానని కూడా చెప్పాడు. ఈ ఆధారాలన్నింటితో రింకూ లఖియా ఎస్ఎస్పీ ఖన్నా వద్దకు వెళ్లాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టగా.. చాలా రోజుల నుంచి ఈ స్కామ్ చేస్తున్నట్లు నిందితులు ఒప్పుకున్నారు.
ఇదీ చదవండి: