Yogi Adityanath News: తన మంత్రివర్గ సహచరులు, అధికారులు, ఉద్యోగులకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక సూచనలు చేశారు. అధికార పర్యటనల సమయంలో హోటళ్లకు బదులుగా ప్రభుత్వ అతిథి గృహాల్లోనే బస చేయాలన్నారు. అలాగే, బంధువుల్ని తమ వ్యక్తిగత కార్యదర్శులుగా నియమించుకోవద్దని మంత్రులకు సూచించారు. అతిథి గృహాల్లోనే బస చేయాలన్న ఆదేశం ప్రభుత్వ అధికారులకూ వర్తిస్తుందని పేర్కొన్నారు. అధికారులు సమయానికి కార్యాలయాలకు రావాలనీ.. మధ్యాహ్న భోజన విరామ సమయం (లంచ్ బ్రేక్) 30 నిమిషాలకు మించకుండా చూసుకోవాలని ఆదేశించారు. మంత్రులు, అధికారులు అధికారిక పర్యటనలకు వెళ్లేటప్పుడు హోటళ్లకు బదులుగా, ప్రభుత్వ అతిథిగృహాల్లో బస చేయాలని కొద్ది రోజుల క్రితమే సీఎం యోగి ఆదేశించినట్టు ఓ అధికారి పేర్కొన్నారు. తమ బంధువుల్ని వ్యక్తిగత కార్యదర్శులుగా నియమించుకోబోమని మంత్రులు చెప్పారన్నారు. మంగళవారం జరిగిన సమావేశంలో లంచ్‌బ్రేక్ 30 నిమిషాలు దాటకుండా చూసుకోవాలని అధికారులకు సూచించారన్నారు. "సాధారణంగా ప్రభుత్వ కార్యాలయాల్లో లంచ్ బ్రేక్ మధ్యాహ్నం 1.30 గంటల నుంచి 2గంటల వరకు ఉంటుంది. కానీ కొందరు లంచ్ బ్రేక్ తర్వాత చాలా ఆలస్యంగా కార్యాలయాలకు వస్తుంటారు. అలాకాకుండా ప్రతి ఒక్కరూ 30 నిమిషాల మధ్యాహ్న భోజన విరామ సమయానికి కట్టుబడి ఉండాలని నిర్దేశించారు. ఆదేశాలు తక్షణమే అమలులోకి వస్తాయని సీఎం చెప్పారు" అని సదరు అధికారి వివరించారు.
మూడ్రోజులకు మించి ఏ ఫైలూ పెండింగ్‌లో ఉండొద్దు!: మరోవైపు, కార్యాలయాలకు ఆలస్యంగా వచ్చే అధికారులు, ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుంటామని యోగి హెచ్చరించారు. ప్రతి కార్యాలయంలో సిటిజన్ చార్టర్‌ను అమలు చేయాలని ఆదేశించారు. అధికారులు, ఉద్యోగులు ప్రభుత్వ కార్యాలయాలకు నిర్దేశిత సమయానికే రావాలనీ.. ఒకవేళ ఆలస్యంగా వస్తే అనుమతించబోమని పేర్కొన్నట్టు ప్రభుత్వ అధికార ప్రతినిధి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సీనియర్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని సూచించినట్టు తెలిపారు. పని పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులు, సిబ్బందిపై చర్యలు ఉంటాయన్నారు. సిటిజన్ చార్టర్‌ను ప్రతి కార్యాలయంలో అమలు చేయాలనీ.. మూడు రోజులకు మించి ఏ ఒక్క దస్త్రమూ పెండింగ్‌లో ఉండొద్దని సీఎం ఆదేశించారు.
ఇదీ చదవండి: మీ వీరోచిత ప్రయత్నాలను యావత్ దేశం మెచ్చుకుంటోంది: మోదీ