ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించారా(traffic violation)? ఇకపై మీకు 15 రోజుల్లోనే పోలీసుల నుంచి నోటీసులు వచ్చేస్తాయి. ఈ మేరకు నూతన నిబంధన(traffic e challan 15 days rule) తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. నియమాలు ఉల్లంఘించిన వ్యక్తులకు చేసిన అపరాధం గురించి పదిహేను రోజుల్లోగా నోటీసులు పంపాలని స్పష్టం చేసింది. చలాన్ కట్టేంత వరకు ఇందుకు సంబంధించిన ఎలక్ట్రానిక్ రికార్డులను భద్రపర్చాలని సూచించింది.
ఈ మేరకు సవరించిన మోటారు వాహనాల చట్టం ప్రకారం కొత్త నోటిఫికేషన్ జారీ చేసింది కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ. చలాన్లు జారీ చేసేందుకు ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగంపై కీలక సూచనలు చేసింది.
రూల్స్ ఇవే!
- చలాన్లు జారీ చేసేందుకు ఎలక్ట్రానిక్ పరికరాలను ఉపయోగించాలి.
- స్పీడ్ కెమెరా, సీసీటీవీ కెమెరా, స్పీడ్ గన్, బాడీ కెమెరా, డ్యాష్‌బోర్డ్ కెమెరా వంటి పరికరాలను రాష్ట్ర ప్రభుత్వాలు వినియోగించాలి.
- జాతీయ, రాష్ట్ర రహదారులు, అధిక ముప్పు ఉన్న ప్రాంతాలు, కీలక జంక్షన్లు, రాకపోకలు ఎక్కువగా ఉన్న కారిడార్ల వద్ద ఇలాంటి పరికరాలను ఏర్పాటు చేయాలి.
- పది లక్షల కన్నా ఎక్కువ జనాభా ఉన్న నగరాలతో పాటు, నోటిఫికేషన్లో పొందుపర్చిన 132 నగరాలకు ఈ నిబంధన వర్తిస్తుంది.
- ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం లేకుండా ఈ పరికరాలను అమర్చాలి.
- హెల్మెట్ ధరించకపోవడం, స్పీడ్ లిమిట్ ఉల్లంఘించడం, నో పార్కింగ్ జోన్లో వాహనాలు నిలపడం వంటివి చేసినప్పుడు సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా నోటీసులు జారీ చేయొచ్చు.
- రెడ్ లైట్ జంపింగ్, ఫోన్లు మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం, నిబంధనలకు విరుద్ధంగా వాహనాలను ఓవర్టేక్ చేసినప్పుడు కూడా సీసీటీవీ ఆధారంగా నోటీసులు పంపించవచ్చు.
ఈ-చలాన్(traffic e challan delhi) వ్యవస్థ దిల్లీలో 2019లోనే ప్రారంభమైంది. పలు నగరాల్లోనూ ఈ వ్యవస్థ అమలులో ఉంది. మహారాష్ట్రలో అత్యధికంగా 19 పట్టణాల్లో ఈ-చలాన్ వ్యవస్థ ఉంది. యూపీలో 17, ఆంధ్రప్రదేశ్‌లో 13, పంజాబ్‌లో 9 పట్టణాల్లో ఎలక్ట్రానిక్ వ్యవస్థ ఆధారంగా చలాన్లు జారీ చేస్తున్నారు. తాజా నిబంధనల ద్వారా ఈ నగరాల సంఖ్యను కేంద్రం పెంచాలని భావిస్తోంది.
ఇదీ చదవండి: రిటైర్ అయ్యాక నెలకు రూ.10వేలు పింఛను- ఇలా చేస్తేనే...