Srivari Salakatla Brahmotsavam: శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో విశిష్టమైన గరుడ వాహన సేవ (Garuda Vahana Seva) కన్నులపండువగా సాగింది. శ్రీవిల్లీ పుత్తూరు నుంచి తెచ్చిన గోదాదేవి తులసీ మాలలు.. పరిమళ భరిత పూమాలలు, నిత్యం మూలవిరాట్టుకు అలంకరించే.. మకరకంఠి, లక్ష్మీకాసులహారం, సహస్రనామమాల, విశేష తిరువాభరణాలతో మలయప్పస్వామిని వాహన మండపంలో సుందరంగా అలంకరించి.. శుక్రవారం రాత్రి ఏడు గంటలకు గరుడవాహన సేవను ప్రారంభించారు.
తిరువీధుల్లో విహరిస్తున్న శ్రీనివాసుడి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకున్న భక్తులు.. గోవింద నామస్మరణలు చేస్తూ.. స్వామికి కర్పూర హారతులు సమర్పించారు. గరుత్మంతుడు శ్రీ మహావిష్ణువు నిత్య వాహనం కావడంతో.. ఈ సేవను తిలకించడం ద్వారా సర్వ దోషాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని.. సుమారు నాలుగు గంటల పాటు.. నాలుగు మాడవీధుల్లో వాహన ఊరేగింపు సాగింది. పన్నెండు రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులు వాహన సేవ ముందు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి.
TTD Brahmotsavams 2023 : కల్పవృక్షంపై భక్తులకు దర్శమిస్తున్న మలయప్ప స్వామి
శుక్రవారం ఉదయం మోహిని అవతారంలో మాడవీధుల్లో విహరించిన శ్రీవారిని దర్శించుకున్న భక్తులు అలాగే.. మాడ వీధుల్లో కూర్చుండిపోయారు. మరో వైపు గరుడవాహన సేవ వీక్షించడానికి వస్తున్న భక్తులు తిరువీధుల్లోకి చేరుకున్నారు. దీంతో మాడవీధులు కిక్కిరిసిపోయాయి.
స్వామి వాహన సేవలో ప్రయోగాత్మకంగా హారతులను నిలిపివేసి ఆ సమయంలో సుమారు 30 వేల మంది భక్తులకు తి.తి.దే దర్శనభాగ్యం కల్పించింది. వాయువ్య, ఈశాన్య మూలల్లో సుమారు గంటన్నర పాటు వాహనాన్ని నిలిపి ఆయా ప్రాంతాల్లో శ్రీవారి వాహనసేవ దర్శనం కోసం వేచి ఉన్న భక్తులను మాడవీధుల్లోకి అనుమతించారు. ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ విధానంతో వాహనానికి సమీపంలో భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు, తిరుపతి జిల్లా పోలీసులు సమన్వయంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
Tirumala Brahmotsavalu Schedule: తిరుమల బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. ఏయే రోజుల్లో ఏయే వాహన సేవంటే..
Srivari Salakatla Brahmotsavam 2023: శ్రీవారి బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 18 నుంచి సెప్టెంబర్ 26 వరకు జరుగుతున్నాయి. నిన్న మోహినీ అవతారం, గరుడ వాహన సేవ జరగగా.. నేడు ఉదయం 8 గంటలకు హనుమత్ వాహనం, సాయంత్రం 4 గంటలకు స్వర్ణ రథం సేవ, రాత్రి 7 గంటలకు గజ వాహన సేవ నిర్వహించనున్నారు.
అదే విధంగా 24వ తేదీన ఆదివారం ఉదయం 8 గంటలకు సూర్యప్రభ వాహనం, రాత్రి 7 గంటలకు చంద్ర ప్రభ వాహనం సేవ, 25వ తేదీన సోమవారం ఉదయం 6:55 గంటలకు రథోత్సవం, రాత్రి 7 గంటలకు అశ్వ వాహన సేవ నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజైన సెప్టెంబర్ 26వ తేదీన మంగళవారం ఉదయం 6:55 గంటలకు చక్రస్నానం, రాత్రి 9 గంటలకు ధ్వజారోహణం నిర్వహించనున్నారు.
Tirumala Srivari Brahmotsavam : తిరు వీధుల్లో సింహ వాహనంపై విహరిస్తున్న శ్రీ మలయప్ప స్వామి