మథురలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకృష్ణ జన్మస్థానంగా పేరొందిన కత్రా కేశవ్ దేవ్ ఆలయ ప్రాంగణంలో ఉన్న మసీదును తొలగింపుపై ఓ హిందూ సంస్థ సివిల్ కోర్టును ఆశ్రయించింది. 17వ శతాబ్దం, మొఘల్ కాలానికి చెందిన షాహి మసీదును స్వచ్ఛందంగా తొలగించేందుకు మసీదు నిర్వహణ కమిటీ అంగీకరిస్తే.. అంతకంటే రెట్టింపు భూమిని ఇస్తామని తెలిపింది.
మథురలోని చౌరాసి కోస్ ప్రాంతంలో మసీదు నిర్వహణ కమిటీకి పెద్ద మొత్తంలో భూమి ఇస్తామని 'ముక్తి ఆందోళన్ సమితి' కోర్టుకు విన్నవించింది. ఈ మేరకు మథుర సివిల్ కోర్టు సీనియర్ జడ్జికి దరఖాస్తు చేసింది. 2020 డిసెంబర్ నుంచి ఈ అంశం కోర్టు పరిధిలో ఉంది. 1967లో కోర్టు ఆమోదంతో శ్రీ కృష్ణ జన్మస్థాన్ సేవా సంస్థ, షాహి ఈద్గా మేనేజ్మెంట్ కమిటీ మధ్య కుదిరిన ఒప్పందాన్ని రద్దు చేయాలని హిందూ సంస్థలు డిమాండ్ చేశాయి.
13.37 ఎకరాల విస్తీర్ణంలోని శ్రీ కృష్ణ జన్మభూమిలోని కత్రా కేశవ్ దేవ్ ఆలయంపై 1669-70లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ దాడి చేసి మసీదు నిర్మించారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ అంశంపై సివిల్ కోర్టుల్లో పలు దరఖాస్తులు, పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయి.
ఇవీ చదవండి: