Sri Ramanavami Celebrations in Badrachalam temple : భద్రాద్రి రాములోరి ఆలయంలో వైభవోపేతంగా సాగుతున్న తిరు కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ ప్రధాన ఘట్టం ఆవిష్కృతం కానుంది. జగదేకవీరుడు రాముడికి.. అతిలోక సుందరి సీతమ్మకు జరిగే కమణీయమైన పెళ్లి వేడుక కోసం మిథిలా ప్రాంగణం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. లోక కల్యాణంగా భావించే కమణీయమైన కల్యాణ మహోత్సవానికి భద్రాద్రి ఆలయ అధికార యంత్రాంగం సకల ఏర్పాట్లు చేసింది. కల్యాణ ఘట్టం ఉదయం 10:30 గంటల నుంచి 12:30 గంటల వరకు జరగనుంది. ఇందుకోసం మిథిలా ప్రాంగణంలో ప్రత్యేకంగా కల్యాణ మండపాన్ని అలంకరించారు.
Bhadradri Ramayya Kalyanam : అభిజిత్ లగ్నంలో కల్యాణం జరగనుంది. తొలుత తిరు కల్యాణానికి సంకల్పం పలికి సర్వవిజ్ఞాన శాంతికి ఆరాధన చేపట్టనున్నారు. కల్యాణానికి ఉపయోగించే సామగ్రిని సంప్రోక్షణ చేశాక.. రక్షా బంధనం నిర్వహించి యోక్త్రధారణ చేస్తారు. దర్బాలతో ప్రత్యేకంగా అల్లిన తాడును సీతమ్మవారి నడుముకి బిగిస్తారు. సీతారాములకు రక్షాబంధనం కడతారు. స్వామి గృహస్త ధర్మం కోసం యజ్ఞోపవీత ధారణ చేస్తారు. తాంబూలాది సత్కారాలు చేసి.. కన్యావరుణ నిర్వహించి శ్రీ రాముడికి సీతమ్మ తగిన వధువని పెద్దలు నిర్ణయిస్తారు. ఇరు వంశాల గోత్రాలను పఠిస్తారు. స్వామివారి పాద ప్రక్షాళన చేసి.. మహాదానాలు సమర్పిస్తారు. వేద మంత్రోచ్ఛారణాలు మార్మోగుతుండగా.. అభిజిత్ లగ్నం సమీపించగానే జీలకర్ర బెల్లం మిశ్రమాన్ని సీతారాముల శిరస్సుపై ఉంచే సమయాన్ని శుభ ముహూర్తమని జగత్ కల్యాణ శుభ సన్నివేశంగా కీర్తిస్తారు.
Sri Ramanavami Celebrations at Badradri : కమణీయంగా సాగే కల్యాణ వేడుకకు ఏటా పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు ప్రభుత్వం అందించడం ఆనవాయితీగా వస్తోంది. దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, రాములోరి కల్యాణానికి ప్రభుత్వం తరఫున ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. కల్యాణ క్రతువు వీక్షించేందుకు భద్రాద్రి వచ్చిన త్రిదండి చినజీయర్ స్వామి.. జీయర్ మఠంలో బస చేశారు. భక్తులకు పరమానందం కలిగించే ఈ వేడుక కోసం ఆలయ అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రత్యేకంగా సెక్టార్లు ఏర్పాట్లు చేసి భక్తులకు అసౌకర్యం లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. చలువ పందిళ్లు వేసి భక్తులంతా కూర్చుని కల్యాణం వీక్షించేలా ఏర్పాట్లు చేశారు. వేసవి దృష్ట్యా మిథిలా మైదానంలో ఫ్యాన్లు, కూలర్లు అమర్చారు. మజ్జిగ ప్యాకెట్లు అందుబాటులో ఉంచారు. 2 వేల మందికి పైగా పోలీసు అధికారులు, సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేశారు.
తిరు కల్యాణ బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టాల్లో మొదటిదైన ఎదుర్కోలు మహోత్సవం భక్తుల జయ జయధ్వానాల మధ్య వైభవోపేతంగా సాగింది. బుధవారం రాత్రి 7 గంటల నుంచి 8 గంటల వరకు సాగిన ఎదుర్కోలు వేడుక భక్తులను రంజింపజేసింది. ఉత్సవాల్లో చివరి ప్రధాన ఘట్టం మహా పట్టాభిషేకం గురువారం జరగనుంది.
ఇవీ చూడండి..