Sri Prasanna Venkateswara Swamy Brahmotsavalu: అనాదిగా వస్తున్న ఆచారం, తరతరాల సంప్రదాయం ప్రకారం స్వామి వారి కల్యాణం పద్మశాలి వంశానికి చెందిన బాలికతో జరిపిస్తారు. ఇది ప్రతి సంవత్సరం జరుగుతున్న కృతువు. స్వామి వారితో కల్యాణానికి ఏటా పద్మశాలి కుటుంబానికి చెందిన బాలికతో వివాహం జరిపించడం ఆనవాయితీ. ఇది అనంతపురం జిల్లాలో జరుగుతుంది.
అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో ప్రసిద్ధి చెందిన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల మూడో తేదీన ఘనంగా ప్రారంభమయ్యాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేసేపేటలో ఉన్న మార్కండేయ స్వామి ఆలయంలో రక్షాబంధన కార్యక్రమం నిర్వహించారు. అనాదిగా వస్తున్న సంప్రదాయం ప్రకారం దేవ దేవుడు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి కల్యాణాన్ని పద్మశాలి వంశానికి చెందిన 9 ఏళ్ల బాలిక వైశాలితో జరపడానికి నిర్ణయించారు. ఈ మేరకు బుధవారం రాత్రి నిశ్చయ తాంబూల కార్యక్రమాలు జరిపించారు.
స్వామి వారి తరఫున ఆలయ కమిటీ ఛైర్మన్ పాలాక్షి రెడ్డి, అర్చకుడు గంటి నాగభూషణం ఆధ్వర్యంలో బాలిక ఇంటికి ఊరేగింపుగా వెళ్లారు. పద్మశాలి సంఘం అధ్యక్షుడు శివప్ప, బాలిక తల్లిదండ్రులు జనార్ధన్, స్వప్న కుటుంబ సభ్యులు బాలికను మార్కండేయ స్వామి ఆలయానికి తీసుకువచ్చారు. అర్చకులు సంప్రదాయ బద్ధంగా మంగళ వాయిద్యాలు నడుమ వేదమంత్రాల మధ్య బాలికతో వెంకటేశ్వరుడి నిశ్చితార్థాన్ని జరిపించారు. ఈ నెల 8న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామికి బాలికను ఇచ్చి వివాహం జరిపేందుకు నిర్ణయించారు. ఈనెల 10వ తేదీన శ్రీవారి బ్రహ్మరథోత్సవం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
స్వామి వారితో వివాహం అనంతరం బాలిక తన దైనందిక జీవితంలో చదువులు, ఉద్యోగాలు పూర్తి చేసుకుని వేరే వ్యక్తిని పెళ్లి చేసుకుంటుంది. శ్రీవారితో కల్యాణమైన ఈ బాలికను పెళ్లి చేసుకోవడానికి పద్మశాలి కులస్థులు, యువకులు పోటీ పడతారు. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామితో కల్యాణమైన ఈ బాలికను పెళ్లి చేసుకుంటే పుట్టింటి వారితో పాటు మెట్టినింటివారు అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో కలకాలం జీవిస్తారని వారి నమ్మకం. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో బాలికతో శ్రీవారి కల్యాణం కన్నుల పండువుగా నిర్వహించడానికి దేవదాయ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. శ్రీవారి కల్యాణోత్సవం, బ్రహ్మరథోత్సవానికి స్థానిక భక్తులతో పాటు ఆంధ్ర, కర్ణాటక ,తెలంగాణ నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి శ్రీవారి సేవలో పాల్గొననున్నారు. వారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బంధీగా చర్యలు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో రాయదుర్గం దేవదాయ శాఖ అధికారి నరసింహారెడ్డి, ఆలయ కమిటీ అధ్యక్షులు పాలాక్షి రెడ్డి, కార్యవర్గ సభ్యులు, ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు, పద్మశాలి వంశస్థులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి: