కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో 'మెట్రోమ్యాన్' ఈ శ్రీధరన్ ప్రభావం తక్కువగానే ఉంటుందని ఆ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ అభిప్రాయపడ్డారు. భాజపాలో శ్రీధరన్ చేరుతున్నారన్న ప్రకటననే కేరళ ఎన్నికల్లో అతిపెద్ద ప్రభావంగా నిలిచిపోతుందని అన్నారు. కేరళలోని కొన్ని స్థానాల్లో మినహా భాజపా ప్రధాన పోటీదారు కాదని చెప్పారు. 2016లో ఒక్క సీటునే గెలుచుకున్న భాజపా తన ప్రదర్శనను మెరుగుపర్చుకోవడం చాలా కష్టమని పేర్కొన్నారు.
పీటీఐ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన.. శ్రీధరన్ రాజకీయ రంగప్రవేశ ప్రకటన తనకు ఆశ్చర్యం కలిగించిందని చెప్పారు. వివిధ ఇంజినీరింగ్ ప్రాజెక్టులను నిర్మించిన ఆయనకు ప్రజాస్వామ్యంలో చేపట్టే విధానాలపై అనుభవం లేదని అన్నారు.
"ఆయనకు ఎలాంటి రాజకీయ అనుభవం లేదు కాబట్టి.. కేరళ అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం తక్కువగానే ఉంటుంది. 53 ఏళ్ల సమయంలో నేను రాజకీయాల్లో చేరినప్పుడు.. అనుకున్న రీతిలో ప్రభావం చూపిస్తానో లేదో అని భావించా. అదే 88 ఏళ్ల వ్యక్తి రాజకీయాల్లో చేరడం గురించి నేనేం చెప్పాలి?"
-శశిథరూర్, కాంగ్రెస్ ఎంపీ
మరోవైపు, రాష్ట్రంలో ఎలాంటి పదవి చేపట్టేందుకైనా శ్రీధరన్ సమర్థుడని కేరళ భాజపా అధ్యక్షుడు కే.సురేంద్రన్ అన్నారు. సీఎం పదవికీ ఆయన సరితూగుతారని చెప్పారు. భాజపాలో శ్రీధరన్ చేరడాన్ని గమనిస్తే.. కేరళలోని వామపక్షాల పాలనతో ప్రజలు విసుగు చెందారన్న విషయం అర్థమవుతుందని చెప్పుకొచ్చారు. వచ్చే రోజుల్లో మరికొంత మంది ప్రముఖ వ్యక్తులు భాజపాలో చేరుతారని తెలిపారు.
ఇదీ చదవండి: కేరళలో భాజపా ఆశలన్నీ 'మెట్రోమ్యాన్' పైనే!