SRA Fraud Case: నగదు అక్రమ రవాణా కేసులో మహారాష్ట్రకు చెందిన ఓంకార్ గ్రూప్, నటుడు, వ్యాపారవేత్త సచిన్ జోషికి చెందిన వైకింగ్ గ్రూప్ నుంచి రూ.410 కోట్ల ఆస్తులను ఈడీ(ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) జప్తు చేసింది. ఇందులో ఓంకార్ గ్రూప్‌కు చెందిన రూ.330 కోట్ల విలువ కలిగిన ఫ్లాట్‌ను, సచిన్ జోషికి చెందిన రూ.80 కోట్ల ఆస్తులను అటాచ్ చేసింది.
ఈడీ ఆరోపణలు..
Case on Sachin Joshi: ముంబయి స్లమ్ రీహబిలిటేషన్ అథారిటీ(ఎస్ఆర్ఏ) స్కీం ప్రాజెక్టులో ఓంకార్ గ్రూప్ అక్రమాలకు పాల్పడిందని ఔరంగాబాద్‌లో ఓ వ్యాపార వేత్త కేసు నమోదు చేశారు. దీనిపై ఈడీ దర్యాప్తు చేపట్టింది. ఈ క్రమంలో స్కీం కింద 2016లో లబ్దిదారుల సంఖ్యను అక్రమంగా పెంచారని ఈడీ ఆరోపించింది.
ఈ ప్రాజెక్టును ఓంకార్ గ్రూప్ చేపట్టగానే ఎస్ఆర్ఏ అధికారులు ఫ్లాట్ విలువను అమాంతం రూ.2.5 కోట్ల నుంచి రూ.4కోట్లకు పెంచారని ఈడీ అధికారులు ఆరోపించారు. దీనిపై అక్రమ పత్రాలను సృష్టించి రూ.410 కోట్లను యస్ బ్యాంకు నుంచి లోన్‌గా తీసుకున్నారని దర్యాప్తులో తేల్చారు. ఈ డబ్బును ఎస్ఆర్ఏ ప్రాజెక్టులో వినియోగించకుండా ఇతర కంపెనీలకు అక్రమ రవాణా చేశారని ఈడీ తెలిపింది.
ఈ కేసులో ఓంకార్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ బాబుల్ శర్మ, ఛైర్మన్ కమల్ కిషోర్‌లను అరెస్టు చేసింది. అంతేకాకుండా ఈ కేసుతో సంబంధం ఉన్న జేఎమ్ జోషి గ్రూప్ ప్రమోటర్ సచిన్ జోషిపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
జర్నలిస్టుపై ఈడీ కొరడా..
దిల్లీ జర్నలిస్టు రాజీవ్ శర్మకు చెందిన రూ.48.21 కోట్ల విలువైన రెసిడెన్షియల్ ప్రాపర్టీని ఈడీ జప్తు చేసింది. శర్మపై.. దేశానికి సంబంధించిన కీలక సమాచారాన్ని చైనా అధికారులకు చేరవేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఇందుకు బదులుగా చైనా అధికారుల నుంచి రాజీవ్ శర్మ.. డబ్బును కూడా పొందారని తెలిపింది. ఈ కేసులో గతేడాది జులైలో అరెస్టైన రాజీవ్ శర్మ.. గత వారమే బెయిల్‌పై విడుదలయ్యారు.
ఇదీ చదవండి: రికార్డు స్థాయిలో 93 సార్లు ఎన్నికల్లో ఓటమి.. మళ్లీ బరిలోకి..