Spurious Liquor Deaths: బిహార్‌లో కల్తీ మద్యం సేవించి అమాయకులు ప్రాణాలు కోల్పోయిన ఘటన మరోమారు వెలుగుచూసింది. భగల్పుర్, గోపాల్‌గంజ్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో కల్తీ మద్యం తాగి.. ఐదు రోజుల్లో 11 మంది మృతి చెందారు. పలువురు తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రిపాలయ్యారు. కల్తీ మద్యమే కారణమని, తమకు న్యాయం చేయాలని మృతుల కుటుంబసభ్యులు డిమాండ్ చేశారు.
మార్చి 13న భగల్పుర్ జిల్లాలోని లోదీపుర్, బార్గంజ్, సబౌర్ సహా సజోరే పోలీస్ స్టేషన్ల పరిధిలో ఐదుగురు మరణించినట్లు అధికారులు తెలిపారు. మరో ఇద్దరు కంటి చూపు కోల్పోయినట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని దాచేందుకు.. కుటుంబ సభ్యులు అంతక్రియలు నిర్వహించారని పేర్కొన్నారు.
అంతకుముందు రోజు మార్చి 12న(శనివారం) గోపాల్‌గంజ్ జిల్లాలో ఇటువంటి ఘటనే బయటపడింది. వైకుంఠపుర్ పోలీసుస్టేషన్ పరిధిలో నలుగురు మరణించగా.. పలువురు అస్వస్థతకు గురై ఆస్పత్రిపాలయ్యారు. కల్తీ మద్యం వల్లే వారు చనిపోయినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించగా.. అక్కడి అధికారులు ఖండించారు.
మార్చి 9న పశ్చిమ చంపానరన్ జిల్లాలోని ఓ గ్రామంలో ఇద్దరు అనుమానస్పద రీతిలో మరణించారు. మరొకరు తీవ్ర అస్వస్థతకు గురైనట్లు పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే మృతికి గల కారణాలు వెల్లడవుతాయని పోలీసులు తెలిపారు.
ఇదీ చూడండి: అధిక రిజల్యూషన్‌తో అల్ట్రాసౌండ్ చిత్రాలు