ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ-ఆస్ట్రాజెనెకా సంస్థ సంయుక్తంగా అభివృద్ధి చేసిన కొవిషీల్డ్‌కు షరతులతో కూడిన అత్యవసర వినియోగానికి తాజాగా భారత్ కూడా ఆమోదం తెలిపింది.
సులభంగా రవాణా చేసే సౌకర్యం ఉండటం, అందుబాటు ధరలో లభించడం ఆక్స్‌ఫర్డ్ టీకా ప్రత్యేకత. భారత్‌లో సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఈ డోసులను ఉత్పత్తి చేస్తోంది.
ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెనెకా టీకా కొత్త స్ట్రెయిన్‌పై సమర్థంగా పనిచేస్తుందా?
బ్రిటన్‌లో వేగంగా వ్యాప్తి చెందుతున్న కొత్త వెర్షన్ వైరస్‌పైనా ఈ టీకా సమర్థంగా పనిచేస్తుందని పరిశోధకులు నమ్ముతున్నారు. వైరస్ పరివర్తనం చెందుతోంది తప్ప.. పూర్తిగా మారిపోలేదని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి టీకా సమర్థతపై మ్యుటేషన్(వైరస్‌లో మార్పు) ప్రభావం ఉండదని భావిస్తున్నారు.
ఫైజర్, మోడెర్నాతో పోలిస్తే ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ ఎలా భిన్నం?
స్పైక్ ప్రోటీన్లను ఉత్పత్తి చేసేందుకు వైరస్ జన్యుక్రమంపై ఆధారపడి ఆక్స్‌ఫర్డ్ టీకా పనిచేస్తుంది. ఈ వ్యాక్సిన్ డబుల్ స్ట్రాండెడ్ 'డీఎన్ఏ'ను ఉపయోగిస్తుంది. కానీ ఫైజర్, మోడెర్నా టీకాలు సింగిల్ స్ట్రాండెడ్ 'ఆర్ఎన్ఏ'ను వినియోగిస్తాయి.
అడినోవైరస్పై ఉన్న ప్రోటీన్ పొర కారణంగా ఆక్స్‌ఫర్డ్ టీకాలో ఉన్న జన్యు పదార్థాలు సురక్షితంగా ఉంటాయి. కాబట్టి ఈ టీకాను అతిశీతల ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయాల్సిన అవసరం ఉండదు. 2 నుంచి 8 డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద ఆరు నెలల వరకు ఈ టీకాను నిల్వ చేయవచ్చు. కానీ మోడెర్నా టీకాను మైనస్ 4, ఫైజర్ టీకాను మైనస్ 70 సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయాల్సి ఉంటుంది.
ప్రయోజనాలేంటి?
- ఆక్స్‌ఫర్డ్ టీకాను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయవచ్చు
- నిల్వ చేయడం సులభం
- ఇతర వ్యాక్సిన్లతో పోలిస్తే అందుబాటు ధరకే లభ్యం
- ఫైజర్ టీకా ఒక్కో డోసుకు 20 డాలర్లు, మోడెర్నా టీకా 19.5 డాలర్లు వసూలు చేస్తోంది. ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ ధర వీటితో పోలిస్తే చాలా తక్కువ
ఆక్స్‌ఫర్డ్ టీకా ఎలా పనిచేస్తుంది?
కరోనా వైరస్ ప్రోటీన్‌కు అడినోవైరస్‌ను జత చేసి ఈ టీకాను తయారు చేశారు. అడినోవైరస్ అనేది సాధారణంగా ఫ్లూ, జలుబుకు కారణమయ్యే వైరస్. చింపాంజీలలో ఉండే సీహెచ్ఏడీఎస్ఎస్1 అనే వైరస్‌ను ఇందులో ఉపయోగించారు. ఇది కణాలలోకి ప్రవేశిస్తుంది కానీ వాటికి ప్రతిరూపంగా మారదు. టీకా శరీరంలోకి ప్రవేశించిన తర్వాత కణాలతో అడినోవైరస్ అనుసంధానమై.. వాటి చుట్టూ ప్రోటీన్ పొరను ఏర్పరుస్తుంది. ఆ తర్వాత కణం ఓ బుడగలా తయారై వైరస్‌ను అందులోకి లాగేస్తుంది. కరోనా వైరస్ స్పైక్ ప్రోటీన్లను యాంటీబాడీలు ఎదుర్కొని నాశనం చేస్తాయి.
ఆక్స్‌ఫర్డ్ టీకా సురక్షితమేనా?
చింపాంజీ అడినోవైరస్ వ్యాక్సిన్‌ను ఆక్స్పర్డ్ పరిశోధకులు చాలా ఏళ్లుగా పరీక్షిస్తున్నారు. ఎబోలా, జికా వైరస్‌లతో పాటు ఎన్నో వ్యాధులకు ఈ విధానాన్నే ఉపయోగిస్తున్నారు. అయితే ఈ పరిశోధనలేవీ పూర్తి కాలేదు. కానీ, ఈ టీకా వల్ల ఏ దశలో కూడా తీవ్రమైన ప్రతికూల ప్రభావాలు కనిపించకపోవడం సానుకూలంశం.
ఈ అడినోవైరస్‌తో తయారుచేసిన కరోనా టీకా ట్రయల్స్‌లోనూ దుష్ప్రభావాలేవీ కనిపించలేదు. కానీ, వలంటీర్లకు ఆరోగ్య సమస్యలు తలెత్తడం వల్ల ఫేజ్ 3 ట్రయల్స్‌ను రెండు సార్లు ఆపేయాల్సి వచ్చింది. అయితే టీకా వల్ల తీవ్రమైన ఇబ్బందులేవీ ఎదురుకాలేదని ఆక్స్‌ఫర్డ్ ప్రకటించింది.
ఇదీ చూడండి: 'మరికొన్ని వారాల్లోనే టీకా అందిస్తాం'