వైకల్యం ఆమెను కుంగదీయలేదు. కదల్లేని స్థితి ఆమె కళకు అడ్డురాలేదు. నిరాశ నిట్టూర్పులు ఆమె దారుల్ని బంధించలేదు. పట్టుదల ఆమెలోని కళను తట్టిలేపింది. అందమైన చిత్రాలు వేసే ఆ చేతుల్ని కదిలించింది. ఫలితంగా వైకల్యాన్ని ఎదిరించి అనుకున్నది సాధించింది. అపూర్వ చిత్రాలను గీసి అందరి ప్రశంసలు అందుకుంటోంది. సంకల్పంతో ఏదైనా సాధించవచ్చని నిరూపించిన ఆమె పేరు మీనా.
మీనా ఊరు.. కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా హోసనహల్లి. పుట్టుక నుంచి.. ఆమె కండరాలు, నరాల బలహీనత(మస్కులా డిస్ట్రొఫీ) వ్యాధితో బాధపడుతోంది. దాంతో చిన్నప్పటి నుంచి మంచానికే పరిమితమైంది.
అయితే చదువును మాత్రం మీనా ఆపలేదు, ఎలాగోలా పదో తరగతి పూర్తి చేసింది. కానీ వ్యాధి తీవ్రం అవడం వల్ల చదువును అక్కడితో ఆపేసింది.
చిన్నప్పటి నుంచి మీనాకు బొమ్మలు గీయడం అంటే ఏంతో ఇష్టం. చదువు ఆపేసిన మీనా.. చిత్రకళపై దృష్టి సారించింది. అందరూ ఆశ్చర్యపోయేలా బొమ్మలు వేసేది. డ్యూక్ పేజ్, మిక్స్డ్ మీడియా, మీడియం డెన్సిటీ ఫైర్‌బోర్డ్, పాట్, సిరామిక్ గ్లాస్ టెక్నిక్ ఉపయోగించి గృహోపకరణాలను తయారు చేసేది. వీటిని ఆన్లైన్లో విక్రయించడం ప్రారంభించింది. ఫలితంగా పేరుతో పాటు డబ్బును కూడా సంపాదించింది.
అంతేకాకుండా.. ఆమె చేసే సెల్ఫ్ క్రాఫ్టెడ్ కీ హోల్డర్స్, ఫొటో హోల్డర్స్, వాల్ హోల్డర్స్, కీ బంచ్ హ్యాంగర్లు, వాచ్ బాక్స్‌లు, బాటిల్ వర్క్‌కు అధిక డిమాండ్ ఉంది.
"వైకల్యం బాధించినా నా కుటుంబంపై ఆధారపడాలనుకోలేదు. సొంతంగా ఏదైనా సాధించాలనుకున్నా. చిన్నపటి నుంచి ఉన్న అలవాటు బొమ్మలు వేయడంపై దృష్టి పెట్టా."
-మీనా, చిత్రకారిణి
ఏదైనా సాధించడానికి వైకల్యం అడ్డుకాదని నిరూపించి మీనా ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది.
ఇదీ చదవండి: 5వేలకుపైగా ప్రసవాలు చేసిన 103 ఏళ్ల బామ్మ