మనిషి జీవితంలో కంప్యూటర్ అవసరం రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. ఆ కంప్యూటర్ వాడకం, భాషలు సంవత్సరాల కొద్దీ సాధన చేస్తూ నేర్చుకునే అంశాలు. కానీ.. ఓ ఏడేళ్ల బుడతడు సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్‌లో ఉత్తమ నైపుణ్యాలు సొంతం చేసుకున్నాడంటే నమ్ముతారా? నమ్మకపోతే ఒడిశాలోని బలాంగీర్‌కు చెందిన ఏడేళ్ల వెంకట్రామన్‌ను చూడాల్సిందే.
"ఇటీవలే మైక్రోసాఫ్ట్ టెక్నాలజీ అసోసియేట్ పరీక్ష రాశాను. అందుకోసం కావల్సిన ఆన్లైన్ శిక్షణ తీసుకున్నాను. ఆన్లైన్ కోడింగ్‌పై కొన్ని ప్రశ్నలు వచ్చాయి. ఆ తర్వాతే నా చదువును కొనసాగించాను."
- వెంకట్రామన్ పట్నాయక్, వండర్ బాయ్ ఆఫ్ బలాంగీర్
ప్రతిభను చూసి కాదనలేక..
వెంకట్రామన్ బలాంగీర్ నగరంలో నివసిస్తాడు. తండ్రి ఓ బ్యాంకులో ఇంటర్నెట్ విభాగంలోనూ, తల్లి ఒడిశా విద్యుత్ పంపిణీ సంస్థ వెస్కోలోనూ పనిచేస్తున్నారు. రెండేళ్ల క్రితం కంప్యూటర్ కోడింగ్‌పై వెంకట్ దృష్టి సారించాడని చెప్తున్నారు అతడి తల్లిదండ్రులు. సాఫ్ట్వేర్ విద్యపై కుమారుడి ఆసక్తి గమనించి, బెంగళూరులోని ఆన్లైన్ కంప్యూటర్ కోడింగ్ శిక్షణా కేంద్రంలో చేర్పించారు. కానీ.. ఆ చిన్నారి కోడింగ్ చేయడమేంటని అక్కడి యాజమాన్యం ఆశ్చర్యపోయింది. ప్రవేశ పరీక్షలో వెంకట్ ప్రతిభ చూసి, ఈ వండర్బాయ్ను చేర్చుకోకుండా ఉండలేకపోయారు.
"వెంకట్రామన్ రెండేళ్ల నుంచీ కంప్యూటర్ కోడింగ్‌పై ఆసక్తి కనబరుస్తున్నాడు. అప్పటినుంచీ ప్రోత్సహిస్తున్నాం. వెంకట్ ఏ పని చేసినా అందుకు అడ్డు చెప్పాలనుకోలేదు. వెంకట్‌ను బెంగళూరులోని కంప్యూటర్ కోడింగ్ సంస్థలో చేర్చేందుకు వెళ్లినప్పుడు.. ఆ సంస్థ యాజమాన్యం నమ్మలేకపోయారు. వాళ్లడిగిన ప్రతి ప్రశ్నకూ వెంకట్ సమాధానాలు చెప్పాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఏ విద్యార్థికైనా తల్లిదండ్రుల నుంచి పూర్తి మద్దతు అవసరముంటుంది. వెంకట్ ఆసక్తి మేరకు మేం మా పూర్తి సహకారం అందిస్తాం."
- కుల్దీప్ పట్నాయక్, వెంకట్ తండ్రి
ఆరేళ్లకే 150 మొబైల్ యాప్‌లు!
పాఠశాల చదువు కొనసాగిస్తూనే.. కంప్యూటర్ కోడింగ్ నేర్చుకోవడం ప్రారంభించాడు వెంకట్. ఆరేళ్ల వయసులోనే 150 మొబైల్ యాప్‌లను రూపొందించి, అందరి దృష్టినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. ఎన్నో ప్రపంచస్థాయి సంస్థల నుంచి రివార్డులు అందుకున్నాడు. మైక్రోసాఫ్ట్ టెక్నాలజీ అసోసియేట్ పరీక్ష రాసిన తర్వాత వెంకట్ పేరు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ప్రస్తావనకు వచ్చింది. సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ గురించి మరింతగా తెలుసుకునేందుకు ఈ బుడతడు నిత్యం కష్టపడుతూనే ఉన్నాడు.
"వెంకట్ వయసు ఇప్పుడు ఏడేళ్లు మాత్రమే. మైక్రోసాఫ్ట్ టెక్నాలజీ పరీక్ష రాశాడు. 5 కోడింగ్ భాషల్లో ఈ పరీక్ష జరిగింది. జావా, జావా పైథాన్, హెచ్టీఎమ్ఎల్, సీఎస్ఎస్, డేటా బేస్ కంప్యూటర్ లాంగ్వేజెస్‌లో పరీక్ష రాశాడు. కంప్యూటర్ కోడింగ్ చదవుకోవడంలో వెంకట్‌కు మా పూర్తి సహకారం అందిస్తాం."
- ప్రమీల, వెంకట్ తల్లి
"కంప్యూటర్ కోడింగ్ నేర్చుకునేందుకు రోజుకు 6 గంటలు కేటాయించేవాడిని. దానితో పాటు రోజుకు రెండు గంటలు సాధన చేసేవాడిని. భవిష్యత్తులో అంతరిక్ష శాస్త్రవేత్త కావాలన్నది నా లక్ష్యం."
- వెంకట్రామన్ పట్నాయక్, వండర్ బాయ్ ఆఫ్ బలాంగీర్
గ్యాస్ లీకేజ్ అలారమ్
గ్యాస్ లీకేజ్‌ను నియంత్రించేందుకు వెంకట్ ఓ సాఫ్ట్వేర్ రూపొందించాడు. ఏ ఇంట్లో అయినా గ్యాస్ లీక్ అయితే వెంటనే అలారం మోగేలా తయారుచేశాడు. మైక్రోసాఫ్ట్ ఎమ్‌టీఏ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, అంతరిక్ష పరిశోధకుడిగా ఎదగాలన్న వెంకట్ కల సాకారం కావాలని ఆశీర్వదిద్దాం.
ఇదీ చదవండి: 14 ఏళ్లకే దమ్ము.. 13కే మందు