తెల్లవారి గుండెల్లో కల్లోలం సృష్టించి.. భారతావని నుదిటిన స్వరాజ్య 'హక్కు' తిలకం దిద్దిన బుద్ధిజీవి.. బాల గంగాధర్ తిలక్! నేడు ఆ పోరాట యోధుడి 101వ వర్ధంతి.
ఉరకలెత్తింది... ఉలిక్కి పడింది!
బాలగంగాధర్ తిలక్‌గా ప్రాచుర్యం పొందిన కేశవ్ గంగాధర్ తిలక్... పేరు వినగానే చాలామందికి... 'స్వరాజ్యం నా జన్మహక్కు' అనే నినాదం గుర్తుకొస్తుంది! ఇప్పుడది కేవలం నినాదమే కావొచ్చు. కానీ ఆనాడా మూడు పదాలు సృష్టించిన ప్రభంజనం అంతాఇంతా కాదు! అప్పటికే దేశంలో స్వాతంత్య్ర ఉద్యమం సాగుతున్నా... బలంగా తమ వాదన వినిపించటానికి జంకేవారు. బ్రిటిష్ పాలనలో తమకూ భాగస్వామ్యం కల్పించాలనే వరకే జాతీయోద్యమ నేతల డిమాండ్లుండేవి. ఆ దశలో, భాగస్వామ్యం కాదు... స్వరాజ్యం... సంపూర్ణ స్వరాజ్యం... కావాలని... స్వరాజ్యం నా జన్మహక్కు... దాన్ని సాధించి తీరుతాం... అంటూ తిలక్ ఇచ్చిన నినాదం ప్రజల్లో ఉత్సాహం నింపింది! స్వాతంత్య్రోద్యమాన్ని సైతం కొత్త పుంతలు తొక్కించింది. బ్రిటిష్ ప్రభుత్వం ఒక్కసారిగా ఉలిక్కిపడింది!
సామాన్యుల్లో అస్తిత్వ చైతన్యం...
గాంధీకంటే ముందు కాంగ్రెస్‌లో పేరున్న నేత తిలక్! తన విప్లవాత్మకమైన భావనలతో... బ్రిటిష్‌పై రాజీలేని పోరుతో... పార్టీలోనే అతివాదిగానే ముద్రపడ్డారు. పార్టీతో విభేదించినప్పుడు కొన్నిసార్లు పక్కనబెట్టినా... ఆయన మౌనంగా ఏమీ లేరు. జాతీయోద్యమాన్ని ఉప్పెనలా మార్చే పనిలో నిమగ్నమయ్యారు తిలక్! సామాన్య ప్రజల్ని చైతన్యవంతులను చేయటానికి, మధ్యతరగతిని... రైతులను, అప్పుడప్పుడే రూపుదిద్దుకుంటున్న పారిశ్రామిక కార్మికలోకాన్ని... లక్ష్యంగా చేసుకొని వారిలో స్వాతంత్య్రోద్యమ భావనల్ని పెంచి... ఉద్యమంలో వారు భాగస్వాములయ్యేలా చేశారు. తద్వారా స్వాతంత్య్రోద్యమాన్ని సామాన్యుల బాట పట్టించారు. ఈ క్రమంలో పార్టీలోనూ అవమానాలు ఎదుర్కొన్నా... బహిష్కరణలు ఎదురైనా... ఎన్నడూ తన లక్ష్యాన్ని వీడలేదు. ప్రజల్లో భారత జాతీయ భావనను తన రచనలు, ప్రసంగాల ద్వారా బలోపేతం చేయటానికే కృషి చేశారు. అందుకే - తమ పాలనకు పెద్దగా ఆటంకం లేకుండా సాగుతున్న తరుణంలో సగటు భారతీయుల మనసుల్లో కదలిక తెచ్చి, సామాన్యుల్లో సైతం స్వాతంత్య్రోద్యమ భావోద్వేగాన్ని రెచ్చగొట్టిన జాతిపితగా తెల్లదొరలు తిలక్‌ను అభివర్ణించారు. జాతీయతను బలంగా నాటి భారతీయ అస్థిత్వానికి పట్టం కట్టిన ఘనత తిలక్‌కే దక్కుతుంది.
గీతాసారమిది...
కేసరి, మరాఠా అనే రెండు పత్రికలు నడిపిన తిలక్... వాటిలో రాతలకు బ్రిటిష్ ప్రభుత్వ ఆగ్రహానికి గురయ్యారు. ఆయన రాతలకు భయపడ్డ బ్రిటిష్ ప్రభుత్వం... రాజద్రోహం నేరం కింద అరెస్టు చేసింది. మొత్తం మూడుసార్లు రాజద్రోహ నేరం ఎదుర్కొన్ననేత ఆయన! మయన్మార్‌లోని కఠినమైన మాండలే జైలులో ఉన్నప్పుడే గీత రహస్య పేరుతో... భగవద్గీతపై భాష్యం రాశారు. భగవద్గీత సారం... సన్యాసం కాదని... నిష్కామ సేవ... మానవత్వంతో కూడిన సేవ అని నొక్కిచెప్పారు. భారతీయ వేదాంతంపైనా, సనాతన ధర్మంపైనా... తిలక్ చాలా విశ్లేషించేవారు. భారతీయ వేదిక మూలాలు... ఆర్కిటిక్ ప్రాంతంలో ఉన్నాయని ప్రతిపాదించిన తిలక్ పశ్చిమం నుంచి ఆర్యులు వచ్చారనే సిద్ధాంతాన్ని అంగీకరించేవారు. భిన్నత్వంలో ఏకత్వం కోసమనే... గణేశ్ ఉత్సవాలు ఆరంభించారు. అన్ని కులాలు, వర్గాలు పాల్గొనే ఈ ఉత్సవం మనందరికీ గర్వకారణం అనేవారు
భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం...
1916లో హోంరూల్ (స్వరాజ్య) ఉద్యమాన్ని ఆరంభించారు. అహింస పథాన్ని వీడి... స్వరాజ్యం కోసం గట్టిగా కృషి చేయాలని గాంధీకి సైతం సూచించారు తిలక్! ఆత్మనిర్భర్ భారత్... అంటున్న ఇప్పటి నినాదం... అప్పుడు తిలక్ స్ఫూర్తితో తీసుకున్నదే. భాషా ప్రయుక్త రాష్ట్రాలుండాలని ప్రతిపాదించిన తొలి నేత తిలక్!
మాతృభాషతో జాతీయ విద్య..
అంతేగాకుండా భారత్ తనకాళ్ళపై తాను నిలబడాలంటే... మాతృభాషకు పెద్దపీట వేసే... జాతీయ విద్యావిధానం కావాలన్నారు. సామాన్యులకు కూడా ఆధునిక విద్య అందుబాటులో ఉంచటం కోసం 1884లో... దక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీని ఆరంభించారు. ఆంగ్ల దృక్పథంతో కాకుండా భారతీయాత్మతో అందులో విద్యనందించాలనేవారు. కొన్నింటిలో పాశ్చాత్యులను అనుసరించినా... ఆత్మ మనదై ఉండాలని కోరుకున్న లోకమాన్య తిలక్... భారత పునరుజ్జీవ మార్గదర్శి! నేటికీ అనుసరణీయ స్ఫూర్తి!
ఆనాడే మేకిన్ ఇండియా...
ఒక్కటి కాదు... ఆయనో తత్వవేత్త, గణితవేత్త, జర్నలిస్టు, రచయిత.. ఉద్యమకారుడు. తిలక్ దృష్టిలో స్వరాజ్యమంటే కేవలం రాజకీయ స్వాతంత్య్రం ఒక్కటే కాదు. సాంస్కృతిక, ఆర్థిక స్వాతంత్య్రం కూడా! సంస్కృతి, విద్య, మీడియా... మూడింటినీ మార్గాలుగా చేసుకొని ప్రజల్ని చైతన్యవంతులను చేయటానికి, భారత జాతీయ అస్థిత్వాన్ని పాదుకొల్పటానికి కృషి చేశారు తిలక్. ఆత్మనిర్భర్ భారత్... నైపుణ్య భారత్, మేకిన్ ఇండియా...అంటూ ఇప్పుడు మనం ప్రతిరోజూ వినే ఈ పదాల్ని వందేళ్ళ కిందటే మంత్రించారు తిలక్!
తన స్వదేశీ అర్థం కేవలం విదేశీ వస్తువులను బాయ్‌కాట్ చేయటమే కాదు... దేశీయంగా మనవాళ్ళు పారిశ్రామికవేత్తలుగా మారాలని, భారత్‌లో తయారీ రంగం విస్తరించాలని కోరుకునేవారు. ఆయనిచ్చిన ఈ స్ఫూర్తితోనే ఈశ్వర్‌దాస్ వర్ష్‌ణే పుణె దగ్గర గ్లాస్‌వర్క్స్ ఫ్యాక్టరీ ఆరంభించారు. ముంబైలో జంషెడ్‌జీ టాటాతో కలసి తిలక్ బొంబాయి స్వదేశీ సహకార స్టోర్స్ కంపెనీ మొదలెట్టారు. భారత్‌లో తయారయ్యే వస్తువులను ప్రోత్సహించటం ఈ కంపెనీ ప్రధాన కర్తవ్యం. ట్యుటికోరిన్‌లో చిదంబరం పిళ్ళై షిప్పింగ్ కంపెనీ తెరిచారు. బ్రిటిష్ ఇండియా స్టీమ్ నావిగేషన్ కంపెనీకి అది తీవ్రమైన పోటీనిచ్చింది. చివరకు... మాండలే జైలులో ఉన్నప్పుడు రాసిన గీతారహస్య పుస్తకం అచ్చువేసేందుకు భారత్‌లో తయారైన కాగితాన్నే వాడాలని పట్టుబట్టారు. స్వదేశీ పేపర్‌మిల్లు పదమ్‌జీ అండ్ సన్స్ వారి పేపర్‌పైనే ఆ పుస్తకం ముద్రితమైంది.
"మన సమస్య వనరులు లేకపోవటం కాదు... ఆత్మస్థైర్యం లేకపోవటం."-తిలక్
"కేవలం చదవటం, రాయటమే విద్య అనిపించుకోదు. ఎవరి కోసం వారు కాకుండా దేశాన్ని, కుటుంబాన్ని నిలబెట్టడం, అందుకోసం కలసి పనిచేయటం అసలైన స్ఫూర్తి! మానవత్వం మొదలు... ఆనక దేవుడి సేవ!"-తిలక్
"ఒకవేళ దేవుడు అంటరానితనం ఉండాలంటే... నేనతడిని దేవుడనే పిలవను."-తిలక్
- జననం: 1856, జులై 23 (మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో)
- చదువు: పుణెలోని దక్కన్ కళాశాల నుంచి 1876లో గణితం, సంస్కృతంతో డిగ్రీ, ముంబై విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్ర పట్టా.
- మరణం: 1920, ఆగస్టు 1 ముంబైలో
ఇవీ చూడండి: