ఎన్నో దెయ్యాల కథలు వినే ఉంటారు కదా! మేమూ మరో దెయ్యం కథ చెప్తాం వినండి. భయపడొద్దు.. దెయ్యం కథే కానీ భయపెట్టదు. భూత్ అనే పేరున్న ఓ ఊరి కథ ఇది. ఝార్ఖండ్ ఖూంటీ జిల్లాలోని అందమైన గ్రామమిది. ముండా సామాజికవర్గానికి చెందిన వారు ఎక్కువ. బ్రిటిషర్లు ఈ ఊరికా పేరు పెట్టారు. స్థానికులైతే బున్హతూగా పిలుచుకుంటారు గానీ.. ఊరిపేరు భూత్గా స్థిరపడిపోయినందున ఇతర ప్రాంతాల వాళ్లు భయపడిపోతున్నారు.
"ఈ ఊరిని మేమంతా బున్హతూ పేరుతో పిలుచుకుంటాం. అధికారికంగా మాత్రం బున్హతూ బదులుగా భూత్ అనే పేరును రికార్డుల్లో రాశారు. అందుకే ఊరి పేరు భూత్ అనే ప్రచారం జరిగింది. ఆ పేరు విని, ఇక్కడ దెయ్యాలుంటాయేమోనని, బయటి నుంచి వచ్చే ప్రజలు భయపడతారు."
- ప్రేమ్చంద్, గ్రామపెద్ద
ఊళ్లోకి వచ్చేందుకు అయిష్టత!
పేరు వల్ల బయటి ప్రాంతాల వారిలో ఈ ఊరిపై చాలా అపోహలు నెలకొన్నాయి. పెళ్లిళ్లు జరిగాక, అమ్మాయిలు ఈ ఊరికి వచ్చేందుకు అస్సలు ఇష్టపడరు. ఏమీ భయముండదని ఒప్పించేవరకూ ఊర్లో ఎవరూ అడుగు కూడా పెట్టరు.
ఇదీ చదవండి: అధ్యాపక వృత్తిని వదిలి.. ప్రకృతి సేవలోకి..
"ఈ ఊరి పేరు విని.. దెయ్యాలు ఊర్లో నివసిస్తాయని అందరూ అనుకుంటారు. కానీ, అలాంటిదేమీ ఉండదు. మా ఊర్లో బాగానే ఉంటుంది."
- బహలేన్, గ్రామస్థుడు
"మా ఊరి పేరు భయపెడుతుంది. పెళ్లి తర్వాత కూడా మా తల్లి గారింట్లోనే నేను మూడేళ్లు ఉన్నా. రెండేళ్లవరకూ భయమేసింది నాకు."
- పార్వతీదేవి, గ్రామస్థురాలు
ఆ ఊరి ఆచారం..
ఊరిప్రజలకు కొన్ని నమ్మకాలున్నాయి. గ్రామస్థులెవరైనా చనిపోతే.. సంప్రదాయంగా వస్తున్న ఉంబూలాదెర్ అని పిలుచుకునే ఓ కార్యక్రమం నిర్వహిస్తారు. ఇలా చేస్తే మిగిలిన వారెవరికీ ఎలాంటి హానీ జరగదని ఊరి ప్రజలు నమ్ముతారు.
"ఊర్లో ఎవరు చనిపోయినా ఉంబులాదెర్ చేస్తాం. చనిపోయిన తర్వాత 3 నుంచి 11 రోజుల మధ్య బేసి దినాన ఇది నిర్వహిస్తాం. మంచి జరగడం కోసం ఇలా చేస్తాం."
- ప్రేమ్చంద్, గ్రామపెద్ద
ఏదేమైనా.. గ్రామంలోని పరిస్థితుల్లో మెల్లగా మార్పు వస్తోంది. ప్రజల్లో అవగాహన పెరిగి, ప్రభుత్వ పథకాల్లో చేరుతున్నారు. పేరు మూలంగా ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొన్న ఊరు.. క్రమంగా మామూలు స్థితికి చేరుకుంటోంది.
ఇదీ చదవండి: కళ కోల్పోతున్న చారిత్రక 'కిలా ముబారక్'!