SPD Srinivasa Rao Controversial Comments on KGBV Staff: 'సమ్మెలో ఉన్నవారిని తొలగించండి. హైకోర్టు కేసులైతే నేను చూసుకుంటాను. నాపై కోర్టు ధిక్కరణ కేసులు చాలానే ఉన్నాయి' అంటూ ఎస్పీడీ శ్రీనివాసరావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై కేజీబీవీ, ఎస్ఎస్ఏ సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో నడుస్తున్న కేబీబీవీ(కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయం) టీచర్లు, బోధనేతర సిబ్బంది మినిమం టైం స్కేలు అమలు చేయాలంటూ కొన్ని రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నారు. కేజీబీవీ టీచర్లు ధర్నా చేయటంపై ఎస్పీడీ శ్రీనివాసరావు జిల్లా స్థాయి అధికారులతో బుధవారం సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన సమ్మెలో ఉన్న కేజీబీవీ టీచర్లు, బోధనేతర సిబ్బందిని ఉద్దేశించి 'సమ్మెలో ఉన్నవారిని తొలగించండి. హైకోర్టు కేసులైతే నేను చూసుకుంటాను. నాపై కోర్టు ధిక్కరణ కేసులు చాలానే ఉన్నాయి' అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగకుండా వారిని మొదట ఏ జిల్లాలో అయితే తొలగించి, కొత్త నియామకాలు చేస్తారో ఆ జిల్లా అధికారులను సన్మానిస్తా అని పేర్కొన్నారు.
KGBV Guest Teachers Agitation: 'ఈ ఉద్యోగాలనే నమ్ముకున్నాం.. తొలగిస్తే ఎక్కడికి వెళ్లాలి..'
సమ్మెకు వెళ్లిన బోధనేతర సిబ్బందిని చర్చలకు పిలవకుండా వారికో దండం పెట్టేసి పంపించేయండి అని వ్యాఖ్యానించారు. దీంతోపాటు పాత వారికి జీతాలు ఇవ్వొద్దని, పెండింగ్ జీతాలున్నా ఇవ్వకుండా ఎగ్గొట్టండి అని జిల్లా స్థాయి అధికారులకు ఎస్పీడీ శ్రీనివాసరావు సూచించారు. ప్రిన్సిపల్స్ కూడా ఈ సమ్మెలో పాల్గొంటే ఎలాంటి నోటీసులూ ఇవ్వకుండా తొలగిస్తామని, ఉద్యోగంలో నుంచి తొలగించే ఆదేశాల నమూనా ప్రతిని జిల్లా స్థాయి అధికారులకు పంపిస్తామని తెలిపారు.
షోకాజ్ నోటీసు ఇచ్చిన వారం తర్వాత వారిని ఉద్యోగం నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేయాలని, ఆ మరుసటి రోజున ఇంతకు మందు ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థుల జాబితాలో నుంచి మెరిట్ ఉన్నవారిని నియమించుకుని పక్క జిల్లాలకు పంపించాలని జిల్లా స్థాయి అధికారులకు శ్రీనివాసరావు సూచించారు. ఈ క్రమంలో మాట్లాడిన ఆయన మెరిట్ జాబితాలో ఉన్నవారే ఇప్పుడు మార్కెట్లో అదృష్టవంతులు అని పేర్కొన్నారు.
KGBV Part Time PGTs Protest: 'ఇన్నేళ్లు పని చేయించుకుని తొలగించారు.. న్యాయం చేయండి'
దీంతోపాటు పరిజ్ఞానం లేకపోవటంతోనే కేజీబీవీ టీచర్లుగా ఉన్నారని, ఏదైనా పోటీ పరీక్షలు రాసుకుని వెళ్లిపోవచ్చని శ్రీనివాసరావు వ్యాఖ్యానించినట్లు ఓ ఉద్యోగి వెల్లడించారు. కేజీబీవీ టీచర్లను ఇంత చులకన చేసి మాట్లాడటమేంటి అని టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యల పరిష్కారానికి సమ్మెలో దిగితే ఒక ఉన్నత స్థాయి అధికారి రాజకీయ నాయకుడిలా మాట్లాడుతూ భయపెడుతున్నారని వాపోయారు.
"సమ్మెలోకి వెళ్లిన వారిని తొలగించండి. హైకోర్టు కేసైతే నేను చూసుకుంటాను. నాపై కోర్టు ధిక్కరణ కేసులు చాలానే ఉన్నాయి. సమ్మెలో ఉన్న కస్తూర్బాగాంధీ విద్యాలయాల టీచర్లు, బోధనేతర సిబ్బందిని మొదట ఏ జిల్లాలో తొలగిస్తారో ఆ జిల్లా అధికారులను అభినందిస్తూ లేఖలు పంపించాలి. కొత్త నియామకాలు చేసిన రాష్ట్ర కార్యాలయానికి పిలిపిస్తే సన్మానిస్తా. సమ్మెకు వెళ్లిన బోధనేతర సిబ్బందిని చర్చలకు పిలవకుండా వారికో దండం పెట్టేసి, పంపించేయండి. పాత వారికి జీతాలు ఇవ్వొద్దు. పెండింగ్ జీతాలున్నా ఇవ్వకుండా ఎగ్గొట్టండి. ప్రిన్సిపాళ్లు సమ్మెలోకి వెళ్తే ఎలాంటి నోటీసులూ ఇవ్వకుండా తొలగిస్తాం. ఉద్యోగంలో నుంచి తొలగించే ఆదేశాల నమూనా ప్రతిని మీకు పంపిస్తాం. షోకాజ్ నోటీసు ఇచ్చిన వారం తర్వాత ఉద్యోగం నుంచి తొలగిస్తూ ఆదేశాలివ్వాలి. ఆ తర్వాత రోజున ఇంతకు ముందు ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థుల జాబితాలో నుంచి మెరిట్ ఉన్నవారిని నియమించుకోవాలి. పక్క జిల్లాలకూ పంపించాలి." - శ్రీనివాసరావు, ఎస్పీడీ